పంజాబ్ మాజీ సీఎం కన్నుమూత
ప్రకాశ్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.
అతి పిన్న వయసులో పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) ఇక లేరు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ఫోర్జీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు, ఎస్ఏడీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మీడియాకు వెల్లడించారు.
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా..
ప్రకాశ్ సింగ్ బాదల్ ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఆయన 1927 డిసెంబర్ 28న రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలోని అబుల్ ఖురానా అనే గ్రామంలో జన్మించారు. ఆయన రాజకీయ ప్రస్థానం సర్పంచ్‌గా మొదలై.. సీఎంగా దేశ రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించే స్థాయికి చేరింది. 30 ఏళ్ల వయసులోనే ఆయన తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 43 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ మృతిపై దేశంలోని వివిధ పార్టీ ముఖ్యనేతలందరూ సంతాపం తెలిపారు.