కుక్కకాటు కేసులో హైకోర్టు ఆసక్తికర తీర్పు.. పరిహారం ఎవరు ఇవ్వాలంటే..
కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మనుషులపై వీధి కుక్కల దాడుల నేపథ్యంలో హైకోర్టులో ఏకంగా 193 పిటిషన్లు దాఖలయ్యాయి.
కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో.. అంతే ప్రమాదకరంగా కూడా. కుక్కల దాడిలో మనుషులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. మన దేశంలో ఏటా 2 కోట్ల మంది కుక్కకాటుకు గురవుతున్నారు. ఇందులో 18 నుంచి 20 వేల మంది రేబిస్ వైరస్ బారినపడి చనిపోతున్నారు. అంతేకాదు దేశంలో రోజు ఎక్కడో ఒక చోట వీధి కుక్కల దాడిలో చిన్నారులు బలి అవుతున్న వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49) అక్టోబర్‌లో వీధి కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా అతను అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆస్పత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్దఎత్తున చర్చ కూడా జరిగింది.
కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మనుషులపై వీధి కుక్కల దాడుల నేపథ్యంలో హైకోర్టులో ఏకంగా 193 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన పంజాబ్-హర్యానా హైకోర్టు కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వీధుల్లో శునకాలు, ఇతర జంతువుల దాడిలో పౌరులు గాయపడితే ప్రభుత్వం తప్పక పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఎవరైనా ఓ వ్యక్తి కుక్కకాటుకు గురైనప్పుడు ఒక్కో పంటి గాటుకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గాయం మరింత తీవ్రమైనది అయితే రూ.20 వేల వరకు పరిహారం అందించాలని ఆదేశించింది.
సందర్భాన్ని బట్టి ఈ పరిహారాన్ని ప్రభుత్వ విభాగాల నుంచి, ప్రైవేటు వ్యక్తుల నుంచి రాబట్టే అధికారం ప్రభుత్వానికి ఉందని ధర్మాసనం పేర్కొంది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. వీధి కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.