జల బాహుబలి ఐఎన్ఎస్ విక్రాంత్
స్వదేశీ పరిజ్ఞానంతో రూ.20 వేల కోట్లతో తయారుచేసిన ఈ బాహుబలిని సెప్టెంబర్ 2న ప్రధాని మోదీ భారతజాతికి అంకితం చేయనున్నారు. ఇది వచ్చే ఏడాది నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో సేవలందించనుంది.
చుట్టూ నీరు.. అలుముకున్న చీకటి. నీళ్లను చీలుస్తూ.. నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ.. డేగ కళ్లతో పరిశీలిస్తూ.. 40 వేల టన్నుల బాహుబలి ప్రయాణం. జలాలపై తేలుతూ సాగే కొండ. ఇదేదో సినిమా కాదు. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం భారతదేశం రూపొందించిన ఇండియన్ నేవీ సర్వీస్ (ఐఎన్‌ఎస్) విక్రాంత్ యుద్ధనౌక విశ్వరూపం. స్వదేశీ పరిజ్ఞానంతో రూ.20 వేల కోట్లతో తయారుచేసిన ఈ బాహుబలిని సెప్టెంబర్ 2న ప్రధాని మోదీ భారతజాతికి అంకితం చేయనున్నారు. ఇది వచ్చే ఏడాది నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో సేవలందించనుంది.
అన్నీ ఆశ్చర్యమే..
దేశరక్షణ కోసం కొచ్చి షిప్‌యార్డులో నిర్మించిన ఈ భారీ యుద్ధనౌక వివరాలు సామాన్యుడిని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. యుద్ధవిమానాలను, హెలికాప్టర్లను మోసుకెళ్లే ఈ నౌక సాంకేతికంగా అత్యాధునికం. రెండు రన్‌వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఉన్న ఈ నౌక క్షిపణి దాడిని కూడా తట్టుకుంటుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భెల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్, ఎస్‌ఆర్ గ్రూప్, మిథానీ, జీఆర్‌ఎస్‌ఈ, కెల్‌ట్రాన్, కిర్లోస్కర్, ఎల్ అండ్ టీ మొదలైన 550 భారీ పరిశ్రమలు దీనికి అవసరమైన పరికరాలను సమకూర్చాయి. అనేక చిన్న పరిశ్రమలు సైతం తమస్థాయిలో పరికరాలను అందించాయి.
ఆస్పత్రి కూడా..
2,200 కంపార్ట్‌మెంట్‌లు ఉన్న ఈ నౌకలో ఒక ఆస్పత్రి కూడా ఉంది. ఫిజియోథెరపీ క్లినిక్, ఐసీయూ, ల్యాబొరేటరీ, సీటీ స్కానర్, ఎక్స్‌రే మెషీన్లు, డెంటల్ కాంప్లెక్స్, ఐసొలేషన్ వార్డు వంటి వసతులున్న 16 పడకల ఆస్పత్రి, రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. దీనిలో వంటశాల కూడా అత్యాధునికమైనదే. గంట సమయంలో వెయ్యిమందికి చపాతీలు, ఇడ్లీలు తయారుచేసి ఆకలి తీర్చగలదు.
అన్నీ భారీగానే..
21,500 టన్నుల స్పెషల్ గ్రేడ్ ఉక్కుతో నిర్మించిన ఈ నౌక పొడవు 262 మీటరు. వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు. 1,750 మంది సిబ్బందితో 18 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలిగే ఈ నౌక అవసరమైతే 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళుతుంది. 88 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. అగ్నిప్రమాదం వంటివి జరిగితే పసిగట్టే మూడువేల సెన్సార్లున్నాయి. ఎక్కడైనా లోపలికి సముద్రపు నీరు వస్తుందంటే హెచ్చరించేందుకు 700 సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ నౌక తయారీకి 15 వేలమంది ఏళ్లతరబడి శ్రమించారంటే.. ఇది నిజంగా జలబాహుబలే.