భార్య, కూతురి ఆత్మలు శాంతిస్తాయని.. నరబలికి యత్నం

చారణలో పోలీసులకు రాసప్పన్ దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెల్లడించాడు. తన భార్య, కుమార్తె కొద్ది రోజులు కిందట చనిపోయారని, వారి ఆత్మలు శాంతించడం కోసం చిన్నారిని బలి ఇవ్వడానికి ప్రయత్నించినట్లు చెప్పాడు.

Advertisement
Update:2023-02-07 13:02 IST

ఓ పూజారి నరబలికి అంతా సిద్ధం చేశాడు. మ‌రికొన్ని క్షణాలు గడిస్తే నరబలి పూర్తవుతుంది. అప్పుడు ఎంట్రీ ఇచ్చారు పోలీసులు.. ఆ పూజారిని చితక్కొట్టి రెండేళ్ల చిన్నారి ప్రాణం కాపాడారు. తమ పాప కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన నాలుగు గంటల్లోనే పోలీసులు రంగంలోకి దిగి చిన్నారిని ప్రాణాలతో కాపాడటంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా నాగర్ కోవిల్ లో కన్నన్, అఖిల దంపతులు నివసిస్తున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. కాగా, ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి ఉన్నట్టుండి అదృశ్యమైంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు పాప ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. చిన్నారి ఇంటికి సమీపంలో ఒక బావి ఉండటంతో అందులో ఏమైనా పడి ఉంటుందా..? అని దిగి వెతికారు. అయినా కనిపించలేదు. అయితే అక్కడికి సమీపంలోని ఒక అరటి తోటలో వింత వింత శబ్దాలు వినిపించడం పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

అక్కడ రాసప్పన్ అనే పూజారి క్షుద్ర పూజలు చేస్తూ కనిపించాడు. అక్కడ పూజలు నిర్వహిస్తున్న చోటే చిన్నారి కూర్చొని ఉండటం కనిపించింది. దీంతో పోలీసులు పూజారి రాసప్పన్ ను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, విచారణలో పోలీసులకు రాసప్పన్ దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెల్లడించాడు. తన భార్య, కుమార్తె కొద్ది రోజులు కిందట చనిపోయారని, వారి ఆత్మలు శాంతించడం కోసం చిన్నారిని బలి ఇవ్వడానికి ప్రయత్నించినట్లు చెప్పాడు. ఇంకాసేపట్లో నరబలి ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వచ్చినట్లు రాసప్పన్ తెలిపాడు. సమయానికి స్పందించి పోలీసులు చిన్నారి నరబలికి గురవకుండా అడ్డుకోవడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. వారే కనుక సకాలంలో స్పందించకపోయి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు దక్కేవి కావని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News