బీజేపీ -జేడీయూ కూటమి ప్రభుత్వం ఏడాది కూడా నిలవదు - ప్రశాంత్ కిషోర్
బిహార్‌లో 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ - జేడీయూ కూటమి కొనసాగదని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు.
బిహార్ లో మహాకూటమి నుంచి బయటికి వచ్చిన సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరి కొంతసేపటి కిందట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కూటములను మార్చి నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా తాజాగా ఏర్పడిన కూటమి కూడా ఎక్కువ కాలం నిలవదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ - జేడీయూ జట్టు కట్టడంపై ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ - జేడీయూ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని తేల్చి చెప్పారు. ఒక ఏడాది లేదా దాని కంటే తక్కువ కాలం మాత్రమే కూటమి కొనసాగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే కూటమిలో ఎవరూ ఊహించనంత మార్పులు వస్తాయని తెలిపారు.
బిహార్‌లో 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా బీజేపీ - జేడీయూ కూటమి కొనసాగదని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూలు మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ కూటమి ఎక్కువ కాలం కొనసాగదని తాను చెప్పినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా 2025 వరకు మాత్రమే బీజేపీ - జేడీయూ కూటమి కొనసాగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఈ రెండు పార్టీలు చెరో దారి చూసుకుంటాయని చెప్పారు.