మొన్న ప్రజ్వల్, ఇప్పుడు సూరజ్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు
సూరజ్ ఫామ్ హౌస్ లో జూన్ 16 తేదీన తనపై లైంగికంగా దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బదులుగా తనకు రాజకీయంగా ఎదిగేందుకు సాయం చేస్తానని బలవంతంగా లైంగిక దాడికి దిగాడని ఆరోపించాడు.
మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం మరిన్ని చిక్కుల్లో పడింది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం నుంచి తేరుకోక ముందే.. ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయ్యారు. ఈ ఉదయం ఆయనను హసన్ పోలీసులు అరెస్టు చేశారు. సూరజ్ రేవణ్ణ.. తనపై స్వలింగ లైంగిక దాడికి పాల్పడినట్టు ఓ పార్టీ కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేశారు.
తనపై సూరజ్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జేడీఎస్ కార్యకర్త చేతన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూరజ్ ఫామ్ హౌస్ లో జూన్ 16 తేదీన తనపై లైంగికంగా దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బదులుగా తనకు రాజకీయంగా ఎదిగేందుకు సాయం చేస్తానని బలవంతంగా లైంగిక దాడికి దిగాడని ఆరోపించాడు. ఈ ఘటన జరిగిన తర్వాత సూరజ్‌కు మెసెజ్ చేస్తే.. ఏం కాదని, అంతా సర్దుకుంటుందని రిప్లై ఇచ్చాడని చేతన్ తన ఫిర్యాదులో స్పష్టం చేశాడు.
ఫిర్యాదుపై స్పందించిన సూరజ్ తనను బ్లాక్‌మెయిల్ చేయడానికే చేతన్ అసత్య ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారని అన్నారు. మరోవైపు అరెస్టు తర్వాత వైద్య పరీక్షలకు సూరజ్ తిరస్కరించడంతో పోలీసులు ఆయనను బెంగళూరుకు తీసుకువచ్చారు. ఆయనకు పొటెన్సి పరీక్ష నిర్వహించనున్నారు.