పోలీసుల ఎదుట హాజరవుతా.. విచారణకు సహకరిస్తా.. ప్రజ్వల్ రేవణ్ణ

ఈ నెల 31న సిట్‌ ముందు విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. తన ఆచూకీ చెప్పనందుకు.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జేడీఎస్‌ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు.

Advertisement
Update: 2024-05-27 14:32 GMT

లైంగిక వేధింపుల కేసులో ఇరుకున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజల్వ్‌ రేవణ్ణ త్వరలోనే భారత్‌కు తిరిగి రానున్నారు. ఈ విషయంపై అతనే స్వయంగా ఒక వీడియో విడుదల చేశారు. ఈ నెల 31న సిట్‌ ముందు విచారణకు హాజరు కానున్నట్లు తెలిపారు. తన ఆచూకీ చెప్పనందుకు.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, జేడీఎస్‌ శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. ఏప్రిల్ 26న పోలింగ్‌ ముగిసినప్పుడు తనపై ఎటువంటి కేసు లేదని, ఆ తర్వాత రెండు, మూడు రోజులలోనే ఇలా ఆరోపణలు వెల్లువెత్తినట్లు చెప్పారు. ఇప్పటికే తాను డిప్రెషన్లో ఉన్నానని, ఇదంతా రాజకీయ కుట్రేనని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని అభ్యంతరకర వీడియోలు వెలుగులోకి రావడమే కాకుండా బాధిత మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఆయనపై ఫిర్యాదులు చేశారు. అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదైంది. తరువాత రోజే అతను దేశం వీడిచి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగి సుమారు నెల రోజులైంది. అయితే ఇప్పటి వరకు అతని ఆచూకీని స్పెషల్ ఇన్విస్టిగేషన్ ఫోర్స్ గుర్తించలేకపోయింది. నాలుగు సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బహిరంగ ప్రకటనలు చేశారు. ప్రజ్వల్ భారతదేశానికి తిరిగి రావాలని, పోలీసులకు లొంగిపోవాలని లేదా తన ఆగ్రహాన్ని చూడాల్సివస్తుందని మాజీ ప్రధాని, రేవణ్ణ తాత హెచ్‌డి దేవెగౌడ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత ఈ వీడియో ప్రకటన రావడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News