'వెడ్ ఇన్ ఇండియా' అంటున్న మోడీ.. కార‌ణాలేంటో తెలుసా..?

బాగా డ‌బ్బులున్న‌వాళ్ల‌వి, సెల‌బ్రిటీల పెళ్లిళ్లు ఇప్పుడు మ‌న దేశంలో జ‌ర‌గ‌ట్లేదు. అంతా ట‌ర్కీ, దుబాయ్‌, బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌, గ్రీస్, వెనిస్ లాంటి దేశాల‌కు వెళ్లి డెస్టినేష‌న్ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు.

Advertisement
Update:2024-01-22 19:30 IST

సంప‌న్న కుటుంబాల‌వారు విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దీనివల్ల కోట్లాది రూపాయ‌ల దేశ సంప‌ద విదేశాల‌కు త‌ర‌లిపోతోంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గుజ‌రాత్‌లో ఇటీవ‌ల ఓ ఆస్ప‌త్రి ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇక్క‌డి నుంచి విదేశాల‌కు వెళ్లి పెళ్లి చేసుకునే పెడ‌ధోర‌ణుల‌కు దూరంగా ఉండాల‌ని హిత‌వు ప‌లికారు. మేడిన్ ఇండియా లాగానే ప్ర‌జ‌లంతా వెడ్ ఇన్ ఇండియాను పాటించాల‌ని పిలుపునిచ్చారు. మోడీ ఇంత‌గా చెప్ప‌డానికి కార‌ణ‌మేంట‌ని త‌ర‌చిచూస్తే ఆస‌క్తిక‌ర అంశాలెన్నో వెలుగులోకి వ‌చ్చాయి.

సెల‌బ్రిటీలే కాదు సొమ్ములున్న‌వాళ్లూ..

ఇండియాలో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అదేనండి బాగా డ‌బ్బులున్న‌వాళ్ల‌వి, సెల‌బ్రిటీల పెళ్లిళ్లు ఇప్పుడు మ‌న దేశంలో జ‌ర‌గ‌ట్లేదు. అంతా ట‌ర్కీ, దుబాయ్‌, బ్యాంకాక్‌, థాయ్‌లాండ్‌, గ్రీస్, వెనిస్ లాంటి దేశాల‌కు వెళ్లి డెస్టినేష‌న్ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు. ఒక్క థాయ్‌లాండ్‌లోనే ఏటా 400కి పైగా ఇండియ‌న్స్‌ డెస్టినేష‌న్ వెడ్డింగ్స్ జ‌రుగుతున్నాయ‌ని థాయ్‌లాండ్ ప‌ర్యాట‌క శాఖ ప్ర‌క‌టించింది. బాగా స‌న్నిహితులైన ఒక 100 మంది బంధుమిత్రుల‌ను ఇక్క‌డి నుంచి తీసుకెళ్లి విదేశాల్లో పెళ్లి చేసుకోవ‌డం ఇప్పుడు సెల‌బ్రిటీ స‌ర్కిళ్ల‌లో పెద్ద ఫ్యాష‌న్‌. కోహ్లి-అనుష్క‌, కేఎల్ రాహుల్‌- అతియా షెట్టి, విక్కీ కౌశ‌ల్‌- క‌త్రినా కైఫ్‌, వ‌రుణ్‌తేజ్‌- లావ‌ణ్య త్రిపాఠి ఇలా చాలామంది పెళ్లిళ్లు విదేశాల్లోనే జ‌రిగాయి. బాగా డ‌బ్బులున్న వ్యాపార‌వేత్త‌లు కూడా పిల్ల‌ల పెళ్లిళ్లు చేయ‌డానికి చ‌లో ఫారిన్ అంటున్నారు.

వంద‌ల కోట్ల ఖ‌ర్చు

ఇలాంటి డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతాయి. వెళ్లిన‌వారంద‌రికీ హోట‌ల్ రూమ్‌లు, పెళ్లి మండ‌పం, వాటికి డెక‌రేష‌న్‌, ఫుడ్‌, లిక్క‌ర్ ఇలాంటివ‌న్నీ స‌మ‌కూర్చి ఆ దేశంలోని వెడ్డింగ్ ప్లాన‌ర్లు కోట్ల రూపాయ‌లు ఛార్జి చేస్తున్నారు. కొత్త‌గా దుబాయ్‌, ఖ‌తార్, ర‌స్ అల్‌ఖైమా, బ‌హ్రెయిన్ లాంటి దేశాలు కూడా మా దేశానికి రండి.. పెళ్లి చేసుకోండి అంటూ జంట‌ల‌ను ఆహ్వానిస్తున్నాయి.. ఇలా కొన్ని వేల కోట్ల మ‌న డ‌బ్బు విదేశాల‌కు వెళ్లిపోతుంది కాబ‌ట్టి ఆ పెళ్లిల్లేవో ఇక్క‌డే చేసుకోండి.. ఆ రూపాయేదో మ‌నవాళ్ల‌నే తిన‌నివ్వండి అంటున్నారు మోడీజీ.. నిజ‌మేగానీ.. అంత ఉదాత్తమైన ఆలోచ‌న‌ల‌తో ఉన్న సెల‌బ్రిటీలు ఉన్నారంటారా!

Tags:    
Advertisement

Similar News