ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టండి: ప్రధాని మోడీ
ఆగస్టు 2 నుంచి 15 వరకు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్స్‌ను మార్చాలని కోరారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఖాతాల డీపీలను త్రివర్ణ పతాకంతో మార్పుచేయాలని పిలుపునిచ్చారు.
ఇండియాకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం 'ఆజాదీ కా అమృతోత్సవ్' వేడుకలను నిర్వహిస్తోంది. మరో 15 రోజుల్లో దేశం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతీ నెల నిర్వహించే ఈ రేడియో కార్యక్రమంలో ఈసారి స్వాతంత్ర దినోత్సవాల గురించి ముచ్చటించారు.
ఆగస్టు 2 నుంచి 15 వరకు అందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్స్‌ను మార్చాలని కోరారు. వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఖాతాల డీపీలను త్రివర్ణ పతాకంతో మార్పుచేయాలని పిలుపునిచ్చారు. మన దేశం 75 ఏళ్ల స్వాతంత్ర మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ అందరూ సంబరాలు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి ఆగస్టు 2న కావడంతోనే ఆ రోజు నుంచి డీపీ(డిస్‌ప్లే పిక్చర్)లు ఛేంజ్ చేయాలని పిలుపు ఇస్తున్నట్లు మోడీ తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా నివాళి అర్పించాలని కోరారు. ఈ జెండా రూపకల్పనలో మేడం కామా కూడా కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పారు.
ఇక ప్రతీ ఇంటి దగ్గర ఆగస్టు 13 నుంచి 15 వరకు మువ్వన్నెల జెండాను ఎగురవేసి.. అమృతోత్సవాల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని మోడీ కోరారు. దేశంలోని ప్రజలందరూ ఏదో ఒక రూపంలో ఈ ఉత్సవాలను జరుపుకోవాలన్నదే తన ఆకాంక్షని చెప్పారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
స్వాతంత్ర పోరాటంలో రైల్వేల ప్రాముఖ్యతను వివరిస్తూ 'ఆజాదీ కా రైల్ గాడీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనిలో భాగంగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.
కర్నాటక రాష్ట్రం కూడా 'అమృత భారతి కన్నడర్తి' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందని మోడీ తెలిపారు. కర్నాటకలోని 75 ప్రదేశాల్లో ఆ ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడాన్ని ఆయన అభినందించారు.