నన్ను గెలిపిస్తే బ్యాచిలర్స్ కు పెళ్లిల్లు చేయిస్తా
పరిశ్రమలు లేకనే యువకులను ఎవరూ పిల్లనివ్వడం లేదు : ఎన్సీపీ (శరద్ పవార్) ఎమ్మెల్యే అభ్యర్థి
తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ ప్రాంతంలోని బ్యాచిలర్స్ కు అమ్మాయిలను చూసి పెళ్లిల్లు చేయిస్తానని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ హామీ ఇచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార శివసేన (శిందే), ఎన్సీపీ (అజిత్ పవార్), బీజేపీ మహయుతి కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ) మహా వికాస్ అఘాడీ కూటమిలు పోటీ పడుతున్నాయి. బీడ్ జిల్లా పర్లీ నుంచి ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాహెబ్ దేశ్ ముఖ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరాఠ్వాడ ప్రాంతంలోని యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఎవరూ పిల్లనివ్వడం లేదని తెలిపారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థి ధనుంజయ ముండే ఈ ప్రాంతానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని.. అందుకే స్థానిక యువతకు ఉద్యోగాలు దొరకడం లేదని తెలిపారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తద్వారా వారికి పెళ్లిల్లు జరిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు.