యూపీ సంగతి చూస్కో యోగి.. హిమాచల్ తో నీకేం పని..?
యూపీలో శాంతిభద్రతల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నోయిడా, ఘజియా బాద్, లక్నో.. క్రైమ్ సిటీస్ గా పేరుపొందాయని, అలాంటి రాష్ట్రానికి అధినేతగా ఉన్న యోగి, హిమాచల్ పరిస్థితుల్ని ఎలా అంచనా వేయగలరని మండిపడ్డారు కాంగ్రెస్ నేత అల్కా లాంబా.
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ వల్లే హిమాచల్ లో అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. దేశంలో శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయంటే దానికి కారణం ప్రధాని మోదీ అని చెప్పారు. సరిహద్దుల్లో సైన్యం శత్రు సేనల్ని నిలువరిస్తుందంటే దానికి కూడా కారణం మోదియేనన్నారు. అయితే ఈ ఓవర్ యాక్షన్ ని ఘాటుగా తిప్పికొట్టారు కాంగ్రెస్ నేత అల్కా లాంబా. 'ముందు యూపీ సంగతి చూస్కో యోగి, హిమాచల్ తో నీకేం పని' అని హెచ్చరించారు.
హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, నిరుద్యోగం, మహిళలకు రక్షణ లేకపోవడం, విద్య, వైద్యం, మౌలిక వసతుల్లో పూర్తిగా వెనకపడిందని చెప్పారు అల్కా లాంబా. కనీసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి మాట్లాడే ధైర్యం కూడా బీజేపీ చేయడం లేదని దుయ్యబట్టారు. సీఎం జైరామ్ ఠాకూర్ పూర్తిగా విఫలం కావడం వల్లే యూపీ నుంచి యోగిని ప్రచారానికి పిలిపించుకున్నారని అన్నారు అల్కా. హిమాచల్ లో గొప్పలు చెప్పుకుంటున్న యోగి, అసలు యూపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించాలని హితవు పలికారు.
యూపీలో శాంతి భద్రతల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, నోయిడా, ఘజియా బాద్, లక్నో.. క్రైమ్ సిటీస్ గా పేరుపొందాయని, అలాంటి రాష్ట్రానికి అధినేతగా ఉన్న యోగి, హిమాచల్ పరిస్థితుల్ని ఎలా అంచనా వేయగలరని మండిపడ్డారు అల్కా. ముందు యూపీని చక్కదిద్దుకో, ఆ తర్వాత హిమాచల్ సంగతి చూడొచ్చు అంటూ సెటైర్లు వేశారు. ఇక సైన్యం ఆత్మస్థైర్యాన్ని కూడా యోగి దెబ్బతీస్తున్నారంటూ మండిపడ్డారు అల్కా. ఇందిరా గాంధీ హయాంలో పాకిస్తాన్ ని ముప్ప తిప్పలు పెట్టి యుద్ధంలో ఓడించి, బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చేలా చేసిన ఘనత భారత సైన్యానికి ఉందని చెప్పారు. అలాంటిది మోదీ హయాంలో సైన్యం చురుగ్గా పనిచేస్తుందని చెప్పడం, ఆనాటి విజయాలను తక్కువచేసి చూపడమేనన్నారు. శాంతి భద్రతలు సవ్యంగా ఉంటే కాశ్మీర్ లో పండిట్ల హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటూ నిలదీశారు. కాశ్మీర్ విషయంలో బీజేపీ ఓ విఫల ప్రయోగం చేసిందని అన్నారు అల్కా. హిమాచల్ లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కుండబద్దలు కొట్టారు.