25 నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్
వెల్లడించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి నిర్వహిస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ వింటర్ సెషన్ ఉంటుందని తెలిపారు. భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి 26వ తేదీకి 75 ఏళ్లు పూర్తవుతున్నందున ఆరోజు పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్ లో ఉభయ సభల సంయుక్త సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుర్గావ్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. విపక్ష ఇండియా కూటమి వక్ఫ్ సవరణ బిల్లుతో పాటు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. ఈనేపథ్యంలో పార్లమెంట్ వింటర్ సెషన్ హాట్ హాట్ గా జరిగే అవకాశముంది.