పోటీపోటీ నిరసనలతో హోరెత్తుతున్నపార్లమెంటు ప్రాంగణం
అంబేద్కర్‌ను అవమానించారంటూ ఎంపీలు ప్రవేశించే ద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు
పార్లమెంటు ఆవరణలో గందరగోళం నెలకొన్నది. అధికార, విపక్ష సభ్యుల పోటీపోటీ నిరసనలతో పార్లమెంటు ప్రాంగణం హోరెత్తుతున్నది. అంబేద్కర్‌ను అవమానించారంటూ ఎంపీలు ప్రవేశించే ద్వారం వద్ద అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. పాత పార్లమెంటు, కొత్త పార్లమెంటు మధ్యలో స్థలంలో రెండు పక్షాలకు సంబంధించిన ఎంపీలు తీవ్రస్థాయిలో ప్రదర్శనలు చేస్తున్నారు.
పార్లమెంటు లోపలికి వెళ్తున్న ఎంపీలను అడ్డుకుంటున్నారు. ఎంపీలను అడ్డుకుంటున్న సమయంలో ఒడిషా ఎంపీకి గాయాలయ్యాయి. రాహుల్‌గాంధే నెట్టారని అధికారపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. గాయపడిన ఒడిశా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగిని సహచర ఎంపీలు ఆస్పత్రికి తరలించారు. ఒక ఎంపీ రాహుల్ నెట్టివేశారని.. ఆ ఎంపీ తనపై పడ్డారని బీజేపీ ఎంపీ తెలిపారు.అయితే సభలోకి వెళ్తుంటే తనను, ఖర్గేను బీజేపీ ఎంపీలు నెట్టివేశారని రాహుల్ గాంధీ చెప్పారు. ఇరుపక్షాల ఎంపీలు ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభలోకి ప్రవేశించినా సభలోనూ అదే నిరసనలు కొనసాగాయి. బైట కూడా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. సభలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగిస్తామని, అంబేద్కర్‌కు అమిత్ షా ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్‌ను అవమానించిందని అధికారపక్ష ఎంపీలు విమర్శిస్తున్నారు.నీలిరంగు దుస్తులు, కండువాలతో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేస్తుండగా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీలూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని బీజేపీ నిరసన చేపట్టింది. పార్లమెంటు మకరద్వారం వద్ద గోడపైకి ఎక్కి విపక్ష సభ్యులు నినాదాలు చేస్తున్నారు
మరోవైపు సభలోనూ ఇదే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్లకార్డులు, నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లాయి. దీంతో లోక్‌సభను స్పీకర్ మధ్యాహ్నానికి 2 గంటలకు వాయిదా వేశారు . పార్లమెంటు వెలుపల నిరసనలు కొనసాగుతున్నాయి.