విద్యార్థులకు పాఠ్యాంశంగా తమన్నా జీవితం.. - మండిపడ్డ తల్లిదండ్రులు

సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Advertisement
Update: 2024-06-28 05:08 GMT

సినీ నటి తమన్నా జీవితాన్ని ఓ పాఠశాల తమ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాలపై వారు బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గల హెబ్బాళలో. ఆ ప్రాంతంలోని సింధీ ఉన్నత పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల విద్యార్థులకు తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది.

ఏడో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో ఏడో చాప్టర్‌లో సింధీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల గురించి పేర్కొన్నారు. అందులో తమన్నా భాటియా, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ల గురించి పాఠ్యాంశంగా చేర్చారు. దీనిని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చిత్రాల్లో అర్ధ నగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడమేమిటని వారు మండిపడుతున్నారు. సింధీ సామాజికవర్గంలో ఎంతో మంది కళాకారులున్నారని, వారి గురించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.

తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని తమ పిల్లలకు టీసీ ఇస్తామంటూ పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. స్వాతంత్య్రం అనంతరం సింధూ ప్రాంత విభజన తర్వాత ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులకు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్టు తెలిపింది. సింధీ సామాజికవర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్టు చెబుతోంది. ఈ వ్యవహారంపై ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.

Tags:    
Advertisement

Similar News