సుప్రీం తీర్పుపై పాక్ అక్కసు
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ణయాలకు అనుగుణంగా కశ్మీరీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమేనంటూ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా ధర్మాసనం ఆదేశించింది. అయితే.. దీనిపై పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు చట్టపరమైన విలువ లేదంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏకపక్షమని, వాటిని అంతర్జాతీయ చట్టం గుర్తించలేదంటూ వ్యాఖ్యానించింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి నిర్ణయాలకు అనుగుణంగా కశ్మీరీలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రభుత్వ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ పేర్కొన్నారు.
పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా దీనిపై స్పందిస్తూ.. భారత సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆరోపణలు గుప్పించాడు. అది పక్షపాత నిర్ణయమేనని అక్కసు వెళ్లగక్కాడు. ఈ నిర్ణయంతో కశ్మీరీ స్వాతంత్య్ర పోరాటం మరింత బలపడుతుందంటూ వ్యాఖ్యానించాడు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలో కశ్మీరీల హక్కుల కోసం అన్ని స్థాయిల్లో పోరాడుతామని పేర్కొన్నాడు.