'పాలమూరు'కు జాతీయ హోదా ఇవ్వలేం
లోక్‌సభలో తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తేల్చిచెప్పింది. ఎంపీ బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో గురువారం కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ టెక్నో ఎకనామిక్ అప్రైజల్ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అలాగే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అడ్వైజరీ కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు టెక్నో - ఎకనామికల్ అనుమతుల కోసం 2022 సెప్టెంబర్‌లో తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను సీడబ్ల్యూసీకి సమర్పించిందని తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణ కృష్ణా నదీ జలాలపై తలపెట్టిందని అన్నారు. కృష్ణా నది జలాల కేటాయింపు వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేడబ్ల్యూడీటీ -2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)కు అప్పగించామని, ఇప్పుడు ఈ అంశం న్యాయస్థానం (ట్రిబ్యునల్) పరిశీలనలో ఉందని వివరించారు. అలాగే ఈ ప్రాజెక్టు అనుమతులకు ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. న్యాయవివాదాలు, నీటి కేటాయింపుల అంశం తేలకుండా పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ స్కీంకు టెక్నో - ఎకనామికల్ అనుమతులు ఇవ్వలేమని.. అది తేలితేగాని ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోలేమని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
హైడ్రాలజీ క్లియరెన్స్ కోసం కేసీఆర్ తండ్లాట.. పట్టించుకోని రేవంత్ రెడ్డి
పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కృష్ణా మిగులు జలాలపై ప్రతిపాదించారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా ప్రాజెక్టును డిజైన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా సరి చేయాలని కేసీఆర్ సంకల్పించారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటే ఆ ప్రాజెక్టుకు నికర జలాల కేటాయింపు ఉండి తీరాలి. ఇందుకోసమే కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మైనర్ ఇరిగేషన్ కు కేటాయించిన 90 టీఎంసీల్లో 45 టీఎంసీల సేవింగ్స్ (పొదుపు) చూపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ఇవ్వాలని సంకల్పించిన 35 టీఎంసీలకు తోడు మిగిలిన పది టీఎంసీలు కలిపి మరో 45 టీఎంసీలు (పోలవరం నుంచి కృష్ణా డెల్టా నీటిలో తెలంగాణకు దక్కే కృష్ణా నికర జలాలు 45 టీఎంసీలు) పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించింది. ఏపీ కొర్రీలు పెట్టడంతో ఈ ప్రతిపాదన ముందుకు పడలేదు. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ డైరెక్టరేట్ వద్ద సమర్థ వాదనలు వినిపించాల్సిన రేవంత్ సర్కారు ఆ విషయాన్ని గాలికొదిలేసింది. ఫలితంగా ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరుకు అనుమతులు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పాలమూరుకు తుది పర్యావరణ అనుమతులు ఇస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) నిర్ణయం తీసుకున్నా అది న్యాయవివాదంలో చిక్కుకుంది. దానిని క్లియర్ చేయిస్తే పూర్తి స్థాయిలో ప్రాజెక్టు పనులు చేసుకునే అవకాశమున్నా ఆ దిశగా రేవంత్ రెడ్డి సర్కారు కనీసం ప్రయత్నించడం లేదు.
రేవంత్ సర్కారు నిర్లక్ష్యం.. 'పాలమూరు'కు శాపం : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతలకు శాపంగా మారిందని ఎమ్మెల్సీ కవిత 'ఎక్స్' వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలో ఎంపీ బలరాం నాయక్ ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానాన్ని తన ట్వీట్‌కు జత చేశారు. ''14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్ స్టోరేజీలో పెట్టిన రేవంత్ సర్కారు.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసింది. కేసీఆర్ హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులను న్యాయవివాదాల సుడి నుంచి బయటకు తేలేకపోయింది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్ పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నం చేస్తే.. ఆ విషయాన్ని కేంద్రానికి సరిగా చెప్పలేక తుది అనుమతులను ఇంకింత సంక్లిష్టం చేసింది. వెరసి.. కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేమని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తేల్చిచెప్పింది. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు.. పాలమూరు ప్రాజెక్టు విషయంలో మీ చిత్తశుద్ధి ఏపాటిదో ఈ రోజు తేలిపోయింది..'' అని పేర్కొన్నారు.