చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడికి ఆర్ఎస్ఎస్ కుట్ర

యూజీసీ ప్రవేశపెట్టిన నూతన ముసాయిదా నిబంధనలను వ్యతిరేకించిన రాహుల్, అఖిలేశ్

Advertisement
Update:2025-02-06 14:52 IST

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ప్రవేశపెట్టిన నూతన ముసాయిదా నిబంధనలను బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముసాయిదాకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం గురువారం ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు దిగింది. ఈ నిరసనలో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ఈ యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదు. ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నం. ఇదే విషయాన్ని నేను కొంతకాలంగా చెబుతున్నాను. ఈ దేశంలో ఒకే చరిత్ర, ఒకే సంప్రదాయం, ఒకే భాష విధించాలనే ఆలోచనతోనే వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల విద్యా వ్యవస్థపై వారు చేస్తున్న ఈ ప్రయత్నం తమ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అని రాహుల్‌ విమర్శించారు.అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ..యూజీసీ ప్రవేశపెట్టిన ముసాయిదాను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ నూతన విధానం యూనివర్సిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్రగా ఆయన పేర్నొన్నారు. ఈ విధానానికి తాము ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమన్నారు.

వర్సిటీలు, కళాశాల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శకాలు-2025 పేరుతో యూజీసీ ఇటీవల ఓ ముసాయిదాను విడుదల చేసింది.అందులోని పలు అంశాలు బాగా వావాదాస్పదమౌతున్నాయి. ఇప్పటివరకు విశ్వవిద్యాలయాల అధిపతులైన వైస్‌ఛాన్స్‌లర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉన్నది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు, కేరళ వంటివి ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి. 

Tags:    
Advertisement

Similar News