ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేరా?

ఇలాగైతే ప్రభుత్వాన్ని, పార్టీని ఎట్లా నడుపుతరు : రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలపై కేసీ ఫైర్‌

Advertisement
Update:2025-02-06 22:49 IST

ఎమ్మెల్యేలను కంట్రోల్‌ చేయలేరా.. ఇలాగైతే ప్రభుత్వాన్ని, పార్టీని ఎలా నడుపుతారని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీపై ఫైర్‌ అయ్యారు. గురువారం హైదరాబాద్‌ లో సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం సీఎం సహా ఇతర నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్‌ తో సమావేశమయ్యారు. సీఎల్పీ సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీ చెప్పే ప్రయత్నం చేస్తుండగానే కేసీ వేణుగోపాల్ జోక్యం చేసుకున్నట్టు తెలిసింది. పార్టీలో లీడర్లకు, క్యాడర్‌ కు మధ్య సమన్వయం లేదంటే ఏదైనా అనుకోవచ్చు.. మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య కో ఆర్డినేషన్‌ లేకపోవడం ఏమిటని నిలదీశారు. అసలు ప్రభుత్వంలో, పార్టీలో ఏం జరుగుతుందో తెలుసా అని ప్రశ్నించారు. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని.. పవర్‌ లోకి వచ్చిన ఏడాదిలోనే పార్టీకి డ్యామేజ్‌ చేసేలా నిర్ణయాలు ఉన్నాయని ఫైర్‌ అయ్యారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలపై గతంలోనే హెచ్చరించామని అయినా పరిస్థితి మార్పు లేదన్నారు. మంత్రులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశమవుతుంటే ప్రభుత్వంలోని ముఖ్యులకు కనీసం సమాచారం లేదంటే నమ్మాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనితీరు ఉందని.. తాము ఏ ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నా అలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం, పార్టీ తప్పిదాలకు పార్టీ ఇన్‌చార్జీ వంత పాడుతున్నట్టుగానే దీపాదాస్‌ తీరు ఉందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని ఎమ్మెల్యేల వరకు తీరు మార్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటికిప్పుడే వెళ్తే మంచి జరుగుతుందో లేదో క్రాస్ చెక్‌ చేసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అందరూ కలిసి టీమ్‌ వర్క్‌ గా పని చేయాలని.. అప్పుడే ప్రభుత్వంలో, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్షం ట్రాప్‌ లో ప్రభుత్వం పడిపోయిందని.. ప్రతి సందర్భంలోనూ డిఫెన్సివ్‌ మోడ్‌లో ప్రభుత్వం ఉంటే పార్టీకి చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. పార్టీని బలోపేతం చేసే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు అంశాలపై కేసీకి సీఎం రేవంత్‌ రెడ్డి నివేదిక అందజేశారు.

మనలో మనం కొట్టుకుంటే నిండా మునుగుతాం : సీఎం రేవంత్‌ రెడ్డి

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ముఖ్యుల దగ్గర నాలుగు గోడల మధ్‌య మాట్లాడుకోవాల్సిన అంశాలను మీడియా ముఖంగా చెప్పడం ఏమిటని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కేబినెట్‌లో తనతో సహా 12 మంది మంత్రులుంటే మూడో వంతు మంత్రులతో ఎమ్మెల్యేలకు సఖ్యత లేదని.. ఈ విషయం బాహాటంగా కనిపిస్తుందన్నారు. పార్టీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ జెండా మోసిన క్యాడర్‌ ను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని.. ఇలాగే ఉంటే పెను నష్టం తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్షం అవకాశం కోసం కాచుకొని కూర్చున్నప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని.. ఏమైనా సమస్యలుంటే తనను కలిసి చెప్పుకోవాలన్నారు. తనతో చెప్పుకోలేని అంశాలు ఏమైనా ఉంటే తానే ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఇప్పిస్తానని తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలను ఇకపై రచ్చకెక్కించొద్దని విజ్ఞప్తి చేశారు. మంత్రులు బీఆర్‌ఎస్‌ ట్రాప్‌ లో ఉన్నారని.. వాళ్లు రెచ్చగొట్టగానే రెచ్చిపోయి ఏదేదో మాట్లాడి అడ్డంగా బుక్కవుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. బీసీ గణనపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయకుంటే నష్టపోతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పార్టీ లైన్‌లోనే ఉండాలని.. దానిని అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని దీపాదాస్‌ మున్షి హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News