యాక్సిస్‌ మైండియా ఎగ్జిట్‌ పోల్‌ లోనూ బీజేపీకే మొగ్గు

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ, ఆప్‌ మధ్య ఆరు శాతం ఓట్ల తేడా

Advertisement
Update:2025-02-06 18:59 IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని యాక్సిక్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్‌ కూడా తేల్చేసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను ప్రకటించాయి. యాక్సిస్‌ మై ఇండియా మాత్రం తమ ఫలితాలను గురువారం ప్రకటిస్తామని ట్వీట్‌ చేసింది. తమ సర్వేను ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చేసుకుని గురువారం విడుదల చేసింది. మిగతా సర్వేల తరహాలోనే యాక్సిస్‌ మై ఇండియా బీజేపీకి స్పష్టమైన ఆదిక్యం వస్తుందని ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా బీజేపీ 68 చోట్ల, మిత్రపక్షాలైన జేడీ(యూ), ఎల్‌జేపీ (రాంవిలాస్‌) పార్టీలు ఒక్కోస్థానంలో పోటీ చేశాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు 70 స్థానాల్లో పోటీకి దిగాయి. బీజేపీ 45 నుంచి 55 స్థానాల్లో విజయం సాధిస్తుందని యాక్సిస్‌ మై ఇండియా ప్రకటించింది. బీజేపీకి 48 శాతం ఓట్లు పోలవుతాయని వెల్లడించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ 42 శాతం ఓట్లతో 15 నుంచి 25 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీకి ఏడు శాతం ఓట్లు పోలవుతాయని, సున్న నుంచి ఒక స్థానం రావొచ్చని అంచనా వేసింది. ఇతరులకు మూడుశాతం ఓట్లు వస్తాయని.. సున్న నుంచి ఒక స్థానంలో గెలిచే అవకాశముందని వెల్లడించింది.

ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ వైపే ప్రజల మొగ్గు

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి పట్టం కడుతోన్న ప్రజలు సీఎంగా మాత్రం అర్వింద్‌ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపారు. 33 శాతం మంది ప్రజలు మళ్లీ కేజ్రీవాల్‌ సీఎం కావాలని కోరుకున్నారు. ప్రస్తుత సీఎం అతిశీ మర్లేనాకు మూడు శాతం, మనీశ్‌ సిసోడియాకు ఒక శాతం, ఆప్‌ నుంచి ఇంకెవరైనా సీఎం అవుతారని ఐదు శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా పర్వేశ్‌ వర్మకు 13 శాతం ప్రజలు మద్దతు పలికారు. మనోజ్‌ తివారికి 12 శాతం, హర్షవర్ధన్‌ కు 9 శాతం, వీరేంద్ర సచ్‌దేవకు రెండు శాతం, బీజేపీలో ఇంకెవరైనా సీఎం కావొచ్చని 12 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా దేవేందర్‌ యాదవ్‌ కు 4 శాతం మంది మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌ నుంచి ఇంకా ఎవరైనా సీఎం కావొచ్చని మూడు శాతం, తమకు తెలియదని మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు.




 


Tags:    
Advertisement

Similar News