'క‌మ‌లం' లో క‌ల‌వ‌రం..!

ఒకవైపు విపక్షాల ఐక్యత, మరో వైపు రాహుల్ భారత్ జోడో యాత్రకు ప్రజల స్పందన బీజేపీని కలవరపెడుతోంది. అందుకే ఈ మధ్య, మోడీ, అమిత్ షా లు ఎక్కడ మాట్లాడినా విపక్షాల ఐక్యతపైనే దాడి చేస్తున్నారు.

Advertisement
Update:2022-09-25 16:13 IST

లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు దాదాపు యేడాదిన్న‌ర‌కు పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ దేశంలో రాజ‌కీయాలు ఇప్ప‌ట్నుంచే క్ర‌మంగా వేడెక్కుతున్నాయి. ఎలాగైనా స‌రే ఈ సారి ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీని గ‌ద్దె దించాల‌ని ప్ర‌తిప‌క్షాలు ఓవైపు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మరో వైపు పార్టీని మ‌రింత‌గా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళి బ‌లోపేతం చేయాల‌ని, విద్వేష రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌ల‌ను ఐక్యంగా ఉంచాల‌నే ల‌క్ష్యంతో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ భార‌త్ జోడో పేరుతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కూ పాద‌యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర‌కు, విప‌క్షాల ఐక్య‌తా ప్ర‌య‌త్నాల‌కు భారీగా సానుకూల స్పంద‌న వ‌స్తోంది.

ఈ ప‌రిణామాలతో బిజెపి క‌ల‌వ‌రం చెందుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే వీటిపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి తో పాటు బిజెపి అగ్ర నేత‌లు నిశితంగా దృష్టి సారిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వారి ప్ర‌సంగాలు తేట‌తెల్లం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించ‌డం బిజెపి, ప్ర‌ధానికి కొత్త కాకపోయినా వారి ప్ర‌సంగాలు, విమ‌ర్శ‌లు చూస్తుంటే తాజా ప‌రిణామాల‌పై వారు ఆందోళ‌న చెందుతున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. ప్ర‌ధాని ఏ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నా ప్ర‌భుత్వ విధానాలు, ప‌థ‌కాల ప్రచారంపై క‌న్నా అక్క‌డ ఏదో విధంగా రాజ‌కీయాల ప్ర‌స్తావ‌న తేవ‌డం, విప‌క్షాల ఐక్య‌తా ప్ర‌య‌త్నాల‌పైనా, కాంగ్రెస్ పార్టీ పైనా దుమ్మెత్తిపోయ‌డ‌మే స‌రిపోతోంది. ఇక అమిత్ షా, పార్టీ అధ్య‌క్షుడు జెపి న‌డ్డా కూడా ఇవే అంశాల‌పై ఫోక‌స్ చేయ‌డం పార్టీలో ఆందోళ‌న‌, అభ‌ద్ర‌తా భావాల‌ను సూచిస్తోంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. పైకి మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతున్న అసంతృప్తి బిజెపిని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది.

బిజెపి నేతృత్వంలోని ఎన్ డియే ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దేశంలో సామ‌ర‌స్య వాతావ‌ర‌ణం క‌నుమ‌రుగై పోతోంద‌ని,నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం ఆకాశాన్నంట‌డం, రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల దుర్వినియోగం, వేధింపు రాజ‌కీయాలు పెరిగి పోయాయ‌నే ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌జ‌ల్లో పెల్లుబుకుతున్న ఆగ్ర‌హాన్ని, అసంతృప్తిని ఏమార్చేందుకు బిజెపి నేత‌లు విప‌క్షాల‌పై నెపం నెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఏడు ద‌శాబ్దాల కాంగ్రెస్ పాల‌న‌లో దేశానికి ఏం చేసిందంటూ ప్ర‌ధాని త‌ర‌చూ విమ‌ర్శిస్తుంటారు. మారుమూల గ్రామాల‌లో తాము విద్యుత్ వెలుగులు నింపామంటూ గొప్ప‌లు చెప్పుకుంటారు. కానీ ఉత్త‌ర ప్ర‌దేశ్ స‌హా త‌మ‌పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల‌లో ద‌ళితుల‌కు, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వై పోయింద‌న్న విష‌యాల‌ను మాత్రం బిజెపి నేత‌లు ప‌ట్టించుకోరు. సంచ‌ల‌నం క‌లిగించిన హ‌త్రాస్ సంఘ‌ట‌న మొద‌లు నిన్న‌టి ఉత్త‌రాఖండ్ లో రిసార్టు హ‌త్య వ‌ర‌కూ జ‌రుగుతున్న దారుణాల‌పై జ‌వాబుదారీ లేదు.

ఇక ఈ అరాచ‌క పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే ల‌క్ష్యంతో విప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతుండ‌డం బిజెపిని ఆందోళ‌న‌కు గురిచేస్తోంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌ర‌మ‌వుతుండ‌డంతో కీల‌క నేత‌ల‌ను వేధించ‌డం మొద‌లైంది. బిహార్ లో నితీష్ కుమార్ బిజెపిని వీడ‌డంతో ఇత‌ర రాష్ట్రాల‌లోని ఆయ‌న పార్టీ జెడియూ నేత‌ల‌ను ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించి పార్టీలో చేర్చుకున్నారు. బిహార్ నాయ‌కుల‌పై ఈడి దాడులు,పాత కేసులు తిర‌గ‌దోడ‌డం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవల బీహార్ లో ప‌ర్య‌టించిన అమిత్ షా రాష్ట్రంలో జంగిల్ రాజ్ న‌డుస్తోందంటూ విమ‌ర్శ‌లు చేశారు. నితీష్ వెన్నుపోటుదారుడంటూ ధ్వ‌జ‌మెత్తారు. అయితే బిజెపి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న‌ప్పుడు కానీ, ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను ప్ర‌లోభ పెట్టి, వేధింపుల‌కు గురి చేసి ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించిన‌ప్పుడు కానీ బిజెపి నేత‌ల‌కు ఈ సుభాషితాలు గుర్తుకు రాలేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

బిజెపికి వ్య‌తిరేకంగా ఐక్య కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్న సీనియ‌ర్ రాజ‌కీయ నేత, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు(కెసిఆర్‌) , టిఎంసి నేత మ‌మ‌తా బెన‌ర్జీ వంటి వారిని క‌ట్ట‌డి చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. విప‌క్షాల ఐక్య‌త వ‌ర్ధిల్లి కేంద్రంలో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం ఖాయ‌మ‌వ్వ‌చ్చ‌న్న అంచ‌నాకు బిజెపి వ‌చ్చిందంటున్నారు. అందుకే ఇటీవ‌ల కాలంలో విమ‌ర్శ‌లు సంకీర్ణ ప్ర‌భుత్వాల‌పై మ‌ళ్ళించారు. దేశంలో సంకీర్ణ ప్ర‌భుత్వాల వ‌ల్ల భార‌త ప్ర‌తిష్ట దారుణంగా దెబ్బ‌తిన్న‌ద‌ని ప్ర‌ధాని మోడి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వ్యాఖ్యానించారు. సంకీర్ణ ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్ట‌డంలో మేటి అయిన బిజెపి నుంచి అందునా ప్ర‌ధాని నోటి నుంచి ఈ వ్యాఖ్య‌లు రావ‌డం విడ్డూరంగా ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాని విమ‌ర్ళ‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ట్టి కౌంట‌ర్ లు ఇస్తూ బిజెపి విధానాల‌ను ఎండ‌గ‌డుతున్నారు. బిజెపి పై ప్ర‌జ‌ల్లో ఉన్న భ్ర‌మ‌లు తొలిగిపోతుండ‌డంతో రానున్న రోజుల్లో రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా ఉండ‌బోతున్నాయ‌నే ఆందోళ‌న కాషాయ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతోంది.

Tags:    
Advertisement

Similar News