ఆయన లేకపోతే రాహుల్ పాదయాత్ర మూడురోజుల్లోనే ముగిసిపోయేదట‌

''ఒక రాత్రి, రాహుల్ గాంధీ తన మోకాళ్ల నొప్పుల తీవ్రత గురించి చెప్పడానికి నాకు ఫోన్ చేసాడు. అతని బదులు మరొకరితో యాత్ర‌ నిర్వహించమని సూచించాడు. ”అని కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో వేణుగోపాల్ చెప్పారు.

Advertisement
Update:2023-02-13 13:36 IST

కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో 4,080 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మూడు రోజుల్లోనే యాత్రను ఆపేద్దామని అనుకున్నార‌ట. ఆయన స్థానంలో మరెవరితోనైనా యాత్రను కొనసాగిద్దామని ఆలోచించారట. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తెలిపారు.

సెప్టెంబర్ 7, 2022న తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన కన్యాకుమారి-కాశ్మీర్ పాదయాత్ర జనవరి 30న ముగిసింది. ఈ పాదయాత్ర 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 75 జిల్లాల్లో సాగింది. కాశ్మీర్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రధాన కార్యాలయం వద్ద మెగా ర్యాలీతో యాత్ర ముగిసింది.

కాగా రాహుల్ గాంధీ సన్నిహితుడు వేణుగోపాల్ మాట్లాడుతూ, యాత్ర ప్రారంభ రోజులలో రాహుల్ గాంధీకి తీవ్రమైన మోకాళ్ళ నొప్పి వచ్చిందని ఇక నడవలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు.

"కన్యాకుమారి నుండి యాత్ర ప్రారంభించిన మూడవ రోజు కేరళలో ప్రవేశించినప్పుడు అతని మోకాళ్ల నొప్పులు తీవ్రమయ్యాయి. ఒక రాత్రి, అతను తన మోకాళ్ల నొప్పుల తీవ్రత గురించి చెప్పడానికి నాకు ఫోన్ చేసాడు. అతని బదులు మరొకరితో యాత్ర‌ నిర్వహించమని సూచించాడు. ”అని కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో వేణుగోపాల్ చెప్పారు.

తీవ్రమైన నొప్పి కారణంగా తన సోదరుడు మార్చ్‌కు నాయకత్వం వహించకపోవచ్చని ప్రియాంక గాంధీ కూడా తనతో చెప్పారని, యాత్ర నాయకత్వాన్ని ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అప్పగించాలని సూచించారని ఆయన అన్నారు.

"రాహుల్‌కు ఉన్న మోకాళ్ల నొప్పుల తీవ్రత గురించి తెలియజేయడానికి ప్రియాంక గాంధీ నాకు ఫోన్ చేశారు. ప్రచారాన్ని ఇతర సీనియర్ నాయకులకు అప్పగించాలని ఆమె సూచించారు" అని వేణుగోపాల్ అన్నారు.

అయితే రాహుల్ వైద్య బృందంలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ రాత్రంతా అందించిన చికిత్స వల్ల రాహుల్ గాంధీ మోకాళ్ళ నొప్పులు తగ్గి యాత్రను కొనసాగించారని, ఆ ఫిజియోథెరపిస్ట్ వల్లనే యాత్ర పూర్తి చేయగలిగామని వేణుగోపాల్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News