వన్ నేషన్- వన్ ఎలక్షన్.. రాష్ట్రపతికి 18,629 పేజీల నివేదిక
లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కోసారి నాలుగైదు రాష్ట్రాలకు చొప్పున ప్రతి ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.
దేశంలో పార్లమెంట్‌తో సహా అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలంటూ వచ్చిన వన్ నేషన్- వన్ ఎలక్షన్ నినాదం దిశగా కీలక అడుగు పడింది. ఈ ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని హైపవర్ కమిటీ 190 రోజులు వివిధ వర్గాలతో మాట్లాడి నివేదిక తయారుచేసింది. 18,629 పేజీలున్న ఈ నివేదికను కోవింద్ కమిటీ గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది.
అభివృద్ధికి అవకాశం
లోక్‌సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కోసారి నాలుగైదు రాష్ట్రాలకు చొప్పున ప్రతి ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. దీనికితోడు ప్రతి రాష్ట్రంలోనూ జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాకుండా ఒకేసారి వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు అన్ని ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఇలా చేస్తే ఆ ఎన్నికలు జరిగిన రెండు, మూడు నెలలే రాజకీయాలు ఉంటాయి. తర్వాత అభివృద్ది మీద దృష్టి సారించవచ్చని జమిలి ఎన్నికలు కోరుకుంటున్నవారి విశ్లేషణ.
కనీసం 5 ఆర్టికల్స్ సవరించాలి
శాసనసభతోపాటు లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కోవింద్ కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలనీ నివేదికలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.