స్పీకర్ ఎన్నికలో ఓం బిర్లా గెలుపు

స్పీకర్ ఎన్నికకు 271 ఓట్లు అవసరం కాగా, ఓం బిర్లా ఆ మార్కు సునాయాసంగా సాధించారు. వరుసగా రెండోసారి లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు.

Advertisement
Update: 2024-06-26 06:42 GMT

18వ లోక్ సభ స్పీకర్ గా బీజేపీ ప్రతిపాదించిన ఓం ప్రకాష్ బిర్లా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వంలో కూడా ఆయన లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. వరుసగా రెండోసారి ఆయన స్పీకర్ గా ఎన్నికయ్యారు. ఈరోజు లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎన్డీఏ ఎంపీలు బలపరిచారు. కూటమిలో లేకపోయినా వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అటు ఇండియా కూటమి తరపున స్పీకర్ పదవికి కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్‌ సావంత్‌ ప్రతిపాదించారు. విపక్ష ఎంపీలు ఆ ప్రతిపాదనను బలపరిచారు. మూజువాణీ విధానంలో ఓటింగ్ జరిగింది. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్టు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. స్పీకర్ ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు.

లాంఛనమే కానీ..

స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాల్సి ఉన్నా.. ప్రతిపక్ష ఇండియా కూటమి ఓటింగ్ కి పట్టుబట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష కూటమి కూడా తమ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో ఓటింగ్ అనివార్యమైంది. ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల బలం ఉంది. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఓంబిర్లాకు మద్దతు తెలిపారు. ఇండియా కూటమికి 232 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఉంది. స్పీకర్ ఎన్నికకు 271 ఓట్లు అవసరం కాగా, ఓం బిర్లా ఆ మార్కు సునాయాసంగా సాధించారు. వరుసగా రెండోసారి లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికయ్యారు.

61 ఏళ్ల ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోటా నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో తొలిసారి ఎన్నికయ్యారు. 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికై అనూహ్యంగా స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మూడోసారి ఎంపీగా గెలిచి, రెండోసారి స్పీకర్ చైర్ లో కూర్చున్నారు ఓం బిర్లా. 

Tags:    
Advertisement

Similar News