ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీరుపై ‘సుప్రీం’ ఫైర్
ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఎన్నికల రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని, ఖూనీ చేశారని మండిపడింది. పిచ్చి రాతలు తదితరాలతో బ్యాలెట్ పత్రాల రూపురేఖలను మార్చడంపై విస్మయం వ్యక్తం చేసింది. అతడు రిటర్నింగ్ అధికారా..? లేక పరారీలో ఉన్న నేరగాడా..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల సందర్భంగా ఆర్‌వో వ్యవహరించిన తీరుపై మండిపడింది. అంతేకాదు.. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ.. ఆరోజు రిటర్నింగ్ అధికారిని తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరుపరచాలని ఆదేశాలిచ్చింది.
చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహణ సాగిన తీరుకు సంబంధించిన వీడియోను ధర్మాసనం తిలకించి పైవిధంగా వ్యాఖ్యలు చేసింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేశాడని స్పష్టమవుతోందని, అతన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానుద్దేశించి మాట్లాడుతూ.. ‘చూడండి.. అతను కెమెరా వైపు ఎందుకు చూస్తున్నాడు? సుప్రీంకోర్టు చూస్తోందని అతనికి చెప్పండి. మిస్టర్ సొలిసిటర్ జనరల్.. ఇదేనా రిటర్నింగ్ అధికారి వ్యవహరించాల్సి తీరు? ఇలాంటివి మేం సహించం’ అని స్పష్టం చేసింది. ఎన్నికలు జరిగిన తీరు సంతృప్తికరంగా లేకుంటే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తామని ఈ సందర్భంగా న్యాయస్థానం తెలిపింది. ఎన్నికల తీరుపై సమాధానం ఇవ్వాలంటూ అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు ఈ సందర్భంగా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.