పార్టీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధుల గురించి ఎవ‌రూ మాట్లాడొద్దు.... స‌భ్యుల‌కు కాంగ్రెస్ హెచ్చ‌రిక‌

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులపై కొందరు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ అభ్య‌ర్ధుల‌కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని, సంయ‌మ‌నం పాటించాల‌ని AICC కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్, జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Update:2022-09-23 19:58 IST

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు అనివార్యంగా మారిన సంద‌ర్భంలో కొంత‌మంది నాయ‌కులు అభ్య‌ర్ధుల విష‌యంలో ఏక ప‌క్షంగా వ్యాఖ్య‌లు చేయ‌డంపై పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్య‌క్తం చేసింది. పార్టీ అభ్య‌ర్ధుల‌కు సంబంధించి ఎటువంటి వ్యాఖ్య‌లు చేయ‌వ‌ద్ద‌ని, సంయ‌మ‌నం పాటించాల‌ని కోరింది. శ‌శిథ‌రూర్ కంటే అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్య‌క్షుడిగా స‌రైన వ్య‌క్తి అంటూ నిన్న కాంగ్రెస్ నేత గౌరవ్ వల్లభ్ శశి థరూర్‌ను అవహేళన చేసినట్టు మాట్లాడారు. దీనిపై శుక్ర‌వారంనాడు పార్టీ ఒక ప్ర‌క‌ట‌న చేసింది.

ఎన్నికలలో పోటీ చేసే సహ‌చ‌రుల‌పై వ్యాఖ్యానించడం మానుకోవాలని పార్టీ అధికార ప్రతినిధులు, కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్ బేరర్లందరినీ కోరింది.

"కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలలో పోటీ చేస్తున్న మన‌ సహ‌చ‌రుల‌పై ఏ రకమైన వ్యాఖ్యలు చేయ‌వ‌ద్ద‌ని, ఏఐసిసి కమ్యూనికేషన్స్ విభాగం అధికార ప్రతినిధులు, ఆఫీస్ బేరర్‌లందరినీ నేను గట్టిగా కోరుతున్నాను అని AICC కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్, జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ పంపిన సందేశంలో పేర్కొన్నారు. "మనందరికీ వ్యక్తిగత ప్రాధాన్యతలు ఉన్నాయి, అయితే మ‌నం చేయాల్సింద‌ల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం ప్రజాస్వామ్య, పారదర్శక వ్యవస్థను కలిగి ఉన్న ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని హైలైట్ చేయడం మాత్రమే" అని ఆయన అన్నారు. పోటీ చేయ‌డానికి ఎవ‌రి ఆమోదం అవ‌స‌రం లేదు. నామినేష‌న్ వేసేందుకు ప‌ది మంది డెలిగేట్స్ ఉంటే స‌రిపోతుంది.

ఎన్నిక‌ల అధికారులు స‌క్ర‌మంగా, పార‌ద‌ర్శ‌కంగా ఎన్నిక‌లు జ‌రిపేందుకు కృషి చేస్తున్నారు. అధికార ప్ర‌తినిధులు కూడా అందుకు గ‌ట్టిగా కృషి చేయాల‌ని ర‌మేష్ సూచించారు. అక్టోబ‌ర్ 17న ఎన్నిక‌లు జ‌రిగితే జ‌ర‌గ‌నివ్వండి. ఇది ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. కానీ మ‌న అంద‌రి దృష్టి అమోఘ‌మైన స్పంద‌న వ‌స్తున్న భార‌త్ జోడో యాత్ర‌ను మ‌రింత విజ‌య‌వంతం చేసే విష‌యంపై ఉండాల‌ని ర‌మేష్ చెప్పారు.

వ‌ల్ల‌భ్ గౌర‌వ్ ఏమ‌న్నారంటే...

కోట్లాదిమంది కార్య‌క‌ర్త‌ల అభీష్టం లాగానే తాను కూడా రాహుల్ గాంధీ పార్టీ అధ్య‌క్షుడు కావాల‌ని కోరుకుంటున్నాన‌ని వ‌ల్ల‌భ్ గౌర‌వ్ పేర్కొన్నారు. అయితే ఆయ‌న పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టేందుకు విముఖంగా ఉన్నారు. అందువ‌ల్ల పోటీ ప‌డుతున్న ఇద్ద‌రిలో ఒక‌రిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే వీరిద్ద‌రికీ పోలికే లేదు అంటూ హిందీలో వ‌ర‌స ట్వీట్లు చేశారు.

మ‌రోవైపు గెహ్లాట్ కేంద్ర‌మంత్రిగా, మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా, ఐదు సార్లు ఎంపీగా ప‌నిచేసిన అనుభ‌వ‌శాలి అని, 45 యేళ్ళ రాజ‌కీయ జీవితంలో మ‌చ్చ‌లేని నాయ‌కుడిగా గెహ్లాట్ కు పేరుంద‌ని గౌర‌వ్ పేర్కొన్నారు. అయితే శ‌శిథ‌రూర్ సాహెబ్ త‌న ఎనిమిదేళ్ళ లో పార్టీకి చేసిన మేలు ఏంటంటే.. సోనియా గాంధీ ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు లేఖ‌లు రాయ‌డ‌మేన‌ని వ్యంగ్యంగా అన్నారు. దీన్ని బ‌ట్టి ఎవ‌రిని ఎంచుకోవాలో స్ప‌ష్ట‌మ‌వుతుంది అని అన్నారు. ఈ వ్యాఖ్య‌ల నేప‌ధ్యంలోనే పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జైరాం ర‌మేష్ ఈ హెచ్చ‌రిక జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News