రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం..చరిత్రలోనే తొలిసారి

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.

Advertisement
Update:2024-12-10 16:41 IST

రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఎగువ సభలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ తో సహా విపక్షాలు తరచూ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.ఈ తీర్మానంపై ఇండియా కూట‌మి పార్టీలైన తృణమూల్‌, ఆమ్‌ ఆద్మీపార్టీ, సమాజ్‌ వాదీపార్టీ, డీఎంకే, ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన 50 మందికిపైగా ఎంపీలు సంత‌కాలు చేశారు. ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్‌కు సమర్పించారు. రాజ్యసభ చైర్మన్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఇది మొదటిసారి.

పెద్దల సభలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేందుకు లేచి నిలబడినపుడు చైర్మన్‌ ఆయనకు అవకాశం ఇవ్వాలని, కాని కాంగ్రెస్‌ అధ్యక్షుడు, సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే లేచి నిలబడగానే మైక్రోఫోన్‌ను చైర్మన్‌ తరచు కట్‌ చేస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం సభ నడవాలని, కాని తాము ఫిర్యాదు చేసిన ప్రతిసారి తమను ఛాంబర్‌లోకి పిలిచి సర్దుబాటు చేసేందుకు చైర్మన్‌ ప్రయత్నిస్తున్నారే తప్ప నిబంధనలను పాటించాలని భావించడం లేదని సీనియర్‌ ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. ఈ నిర్ణయం బాధ కలిగించినా ధన్ ఖడ్ మితిమీరిన పక్షపాత ధోరణి వల్ల తప్పక నోటీసులు సమర్పించాల్సి వచ్చిందని విపక్ష నేతలు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News