సీఎం పదవికి నితీష్ మళ్లీ రాజీనామా..?
కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్.. తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని ఎన్డీఏ కూటమి ధీమాతో ఉంది.
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్.. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బిహార్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది.
కొన్ని నెలల క్రితం ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నితీష్ కుమార్.. తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిన విషయం తెలిసిందే. కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని ఎన్డీఏ కూటమి ధీమాతో ఉంది. 350కి పైగా సీట్లు సాధించి మరోసారి అధికారం చేపడతామని చెప్తోంది. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి మోడీ 3.0 కేబినెట్‌లో చేరతారని తెలుస్తోంది. ఇందుకోసం జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
నితీష్ కుమార్ గతంలో వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి మధ్యలో ఏడాది మినహా ఇప్పటివరకూ బిహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్. ఇక ఆయన రాజకీయ వారసుడెవరనేది ఆసక్తి నెలకొంది. అయితే నితీష్ రాజీనామా అంశాన్ని ఇప్పటివరకూ జేడీయూ ధృవీకరించలేదు.