ఢిల్లీని వికసిత్ రాజధానిగా మారుస్తా : ప్రధాని మోదీ

పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించిందని ప్రధాని మోదీ అన్నారు.

Advertisement
Update:2025-02-08 20:22 IST

ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంతో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సహం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఢిల్లీ ప్రజలు ఇకపై మోడ్రన్ నగరాన్ని చూడబోతున్నారని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చని పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకి పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికామని, మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మోదీ చెప్పారు. బీహార్ లో నితీశ్ కుమార్ కూడా ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని వివరించారు. బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని ఉద్ఘాటించారు. "ఢిల్లీని వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి.

ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమే అధికారంలో ఉంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పాలన ఎంత అధ్వానంగా ఉందో అందరూ చూశారు. అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారు. మాజీ సీఎం క్రేజీవాల్, మనీష్ సిసోడియా అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎన్నో సంవత్సరాల పాటు పోరాడారు. ఇవాళ ఆ అవినీతి పార్టీ ఓటమిపై అన్నా హజారే కూడా సంతోషిస్తున్నారు. అభివృద్ధి వైపే ఉంటామని ఢిల్లీ ప్రజలు ఓటుతో ఘనమైన తీర్పు ఇచ్చారు. యమునా నది మనందరికీ పూజ్యనీయమైన నది. కానీ, నది పరిశుభ్రతను నిర్లక్ష్యం చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నదిని మేం ప్రక్షాళన చేస్తాం. యమునా నది పవిత్రతను కాపాడతాం. ఇది మోదీ గ్యారెంటీ" అంటూ ప్రసంగించారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఢిల్లీ అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కమలం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ-48, ఆప్-22 గెలుచుకున్నాయి. ఎన్నికల్లో మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఓటమి పాలయ్యారు. 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో అధికారం చేపట్టడంతో కాషాయ పార్టీ నేతల్లో హర్షాతిరేకలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News