ప్రణబ్‌ చనిపోయినప్పుడు మీరేం చేశారు?

తన తండ్రి చనిపోతే నివాళులు అర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ధ్వజం

Advertisement
Update:2024-12-28 10:39 IST

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే స్మారక స్థలం నిర్మించాలని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీని కోరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోతే నివాళులు అర్పించడానికి కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ 2020లో కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు నివాళులు అర్పించడాని సీడబ్ల్యూసీ సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని శర్మిష్ఠా పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ తనను తప్పుదోవ పట్టించిందని కూడా ఆరోపించారు. రాష్ట్రపతులకు ఆ సంప్రదాయం పాటించడం లేదని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్‌ నేత తనకు చెప్పారన్నారు. తన తండ్రి డైరీని చదివితే అది నిజం కాదని తెలిసిందన్నారు. రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌కు నివాళులు అర్పించడానికి సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించినట్లు అందులో ఉన్నదని వెల్లడించారు.

ఈ సందర్భంగా మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు సంబజ్‌ బారు రాసిన 'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' అనే పుస్తకం గురించి ఆమె ప్రస్తావించారు. అందులో 2004-2014 వరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక చిహ్నాన్ని నిర్మించలేదన్నారు. దీంతోపాటు ఆయన అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా స్వస్థలమైన హైదరాబాద్‌లో జరగాలని కాంగ్రెస్‌ కోరిన విషయం ఆ పుస్తకంలో ఉందన్నారు.

Tags:    
Advertisement

Similar News