మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్?
ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారన్న బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి జోరు స్పష్టంగా కనిపిస్తున్నది. 288 అసెంబ్లీ స్థానాల్లో 221 చోట్ల ఆధిక్యంలో ఉన్నది. ఈ క్రమంలో మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అనే చర్చ మొదలైంది. బీజేపీ నేత, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కే సీఎం పదవి దక్కే అవకావాశాలున్నాయి. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ వెల్లడించారు. దేవేంద్ర ఫడ్నవీస్ తదుపరి సీఎం అవుతారని ఆయన తల్లి కూడా పేర్కొన్నారు. అలాగే ఆయనతో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే భేటీ కానున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనాయకత్వం రేపు ముంబయికి కేంద్ర పరిశీలకులను పంపనున్నట్లు సమాచారం. వారు కూటమి పార్టీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్నది. ఈ నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇదిలా ఉంటే నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఫడ్నవీస్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మహాయుతిలో బీజేపీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 చోట్ల పోటీచేయగా 124, 55, 38 లీడ్‌లో కొనసాగుతున్నాయియి. విపక్ష మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ 101, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల బరిలోకి దిగగా.. 20, 19, 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేశాయి. మహాయుతి మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నది. వడాలలో 59,764 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ గెలుపొందారు.