రాహుల్ గాంధీకి కొత్త పాస్‌పోర్ట్ జారీ.. కాసేపట్లో అమెరికా పర్యటనకు

అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ శాన్‌ఫ్రాన్సిస్‌కో, వాషింగ్డన్ డీసీ, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు.

Advertisement
Update:2023-05-29 16:58 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ రాహుల్ గాంధీకి కొత్త పాస్‌పోర్ట్ జారీ అయ్యింది. ఢిల్లీ కోర్టు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ '(ఎన్‌వోసీ) ఇచ్చిన రెండు రోజుల్లోనే రాహుల్ గాంధీకి సాధారణ పాస్‌పోర్టును ఇచ్చారు. దీంతో రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు మార్గం సుగమమం అయ్యింది. మరి కొన్ని గంటల్లో రాహుల్ గాంధీ శాన్‌ఫ్రాన్సిస్‌కో బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ యూఎస్‌లోని మూడు నగరాల్లో పర్యటించనున్నారు.

'మోడీ ఇంటి పేరు' వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్‌లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటరీ రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ తర్వాత రాహుల్ తన డిప్లొమాటిక్ పాస్‌పోర్టును సరెండర్ చేశారు. అమెరికా పర్యటన ఉన్న నేపథ్యంలో తనకు సాధారణ పాస్‌పోర్ట్ మంజూరు చేయాలని.. దీనికి అవసరమైన ఎన్ఓసీ జారీ చేయాలంటూ ఢిల్లో కోర్టును గత వారం ఆశ్రయించారు. కాగా. రాహుల్ గాంధీకి పాస్‌పోర్ట్ కోసం ఎన్ఓసీ జారీ చేయవద్దని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ బెయిల్‌పై ఉన్నందునే ఆయనకు ఎన్ఓసీ ఇవ్వొద్దని కోరారు. అయితే బెయిల్ మంజూరు చేసే సమయంలో రాహుల్ గాంధీ ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు విధించనందున.. మూడేళ్ల పాటు ఎన్ఓసీ జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీకీ కేంద్ర ప్రభుత్వం కొత్త సాధారణ పాస్‌పోర్ట్ జారీ చేసింది.

అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ శాన్‌ఫ్రాన్సిస్‌కో, వాషింగ్డన్ డీసీ, న్యూయార్క్ నగరాల్లో పర్యటించనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్‌కోలో రెండు రోజులు పాటు పలు సమావేశాల్లో పాల్గొంటారు. మే 30న ఆయన ఎన్ఆర్ఐలతో శాంటాక్లారాలోని క్లారా మారియట్‌లో సమావేశం అవుతారు. మే 31న సిలికాన్ వ్యాలీలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో 'ది న్యూ గ్లోబల్ ఈక్విలిబ్రియన్' అనే అంశంపై ప్రసంగిస్తారు.

జూన్ 1, 2న వాషింగ్టన్ డీసీలో ఉంటారు. జూన్ 1న నేషనల్ ప్రెస్ క్లబ్‌లో భారత ప్రజాస్వామ్య భవిష్యత్, వాక్ స్వాతంత్రం, ఆర్థిక అభివృద్ధిపై మాట్లాడతారు. సీఎన్ఎన్ ఛానల్‌కు ఇంటర్వ్యూ కూడా ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

ఇండో-అమెరికన్ పారిశ్రామికవేత్త ఫ్రాంక్ ఇస్తామ్ ఇచ్చే విందులో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వ్యాపార దిగ్గజాలు, సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొంటారు.

జూన్ 4న న్యూయార్క్ జావిట్స్ సెంటర్‌లో ఇండియన్ అమెరికన్స్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే అమెరికాలో ఉన్న భారత సంతతి కాంగ్రెస్ సభ్యులతో కూడా సమావేశం అవుతారు.

Tags:    
Advertisement

Similar News