ఎట్టకేలకు జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్ కు బెయిల్
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో దళిత బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్ ను పోలీసులు అరెస్టు చేసి రెండేళ్ళయ్యింది. ఇంత కాలానికి ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆయనకు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది.
రెండేళ్ళుగా ఉత్తరప్రదేశ్ జైల్లో ఉంటున్న కేరళ జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్ కు సుప్రీం కోర్టు ఇవ్వాళ్ళ బెయిల్ మంజూరు చేసింది. యూపీలోని హత్రాస్ లో ఓ దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై రిపోర్ట్ చేయడానికి వెళ్తున్న కప్పన్ ను మార్గమధ్యలోనే అరెస్టు చేసిన పోలీసులుపాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ)తో సంబంధాలున్నాయంటూ అతనిపై యూఏపీఏ కేసు నమోదు చేశారు.
ఆయన అరెస్టు కు వ్యతిరేకంగా కేరళ జర్నలిస్టు యూనియన్, కప్పన్ కుటుంబం రెండేళ్ళుగా పోరాడుతోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి యు యు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం అతనికి ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. "ఈ దశలో, మేము విచారణ పురోగతి, ప్రాసిక్యూషన్ ద్వారా సేకరించిన విషయాలపై వ్యాఖ్యానించడం లేదు. ఎందుకంటే ఇంకా ఈ విషయం అభియోగాల రూపకల్పనలో ఉంది" అని బెంచ్ పేర్కొంది.
అయితే, అప్పీలుదారు కస్టడీ వ్యవధి, కేసు యొక్క విచిత్రమైన వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని అతనికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు బెంచ్ తెలిపింది.
విడుదల తర్వాత మొదటి ఆరు వారాల పాటు కప్పన్ ఢిల్లీలోనే ఉండాలని, ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవధి తర్వాత, అతను కేరళకు వెళ్లవచ్చు. అక్కడ అతను ప్రతి సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరితోనూ టచ్‌లో ఉండవద్దని కూడా కోర్టు ఆదేశించింది.
కప్పన్‌పై ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసుకు సంబంధించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కప్పన్ భార్య రైహానా సిద్ధిక్ తెలిపారు. ''ఈడీ కేసులో కూడా కప్పన్‌కు త్వరలో బెయిల్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ న్యాయ పోరాటంలో నాకు, నా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. గత రెండేళ్లలో మేము ఎదుర్కొన్న బాధను నేను వివరించలేను'' అని ఆమె అన్నారు.