ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ప్రాంతీయ పార్టీలే
తనకున్న సమాచారం ప్రకారం బీజేపీ కూటమికి 200 ప్లస్ సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందని సిద్ధరామయ్య చెప్పారు. వారు సొంతంగా అధికారంలోకి రాలేరని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. అలాగని ఇండియా కూటమికి కూడా పూర్తి మెజారిటీ రాకపోవచ్చని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల పునరేకీకరణ జరుగుతుందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దక్షిణాదిలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు. సిద్ధరామయ్య శుక్రవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
400 లేదా అంతకుమించి సీట్లు తమ పార్టీకి వస్తాయని బీజేపీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. ఎన్డీయే కూటమికి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడినన్ని సీట్లు రావని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దేశంలో కాషాయ పార్టీపై వ్యతిరేకత ‘అండర్ కరెంట్’లా ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీపై వ్యతిరేకత ఓటర్లలో సైలెంట్‌గా ఉందని, ఫలితాలు వెలువడిన తర్వాత ఆ విషయాన్ని ప్రజలే గుర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు.
తనకున్న సమాచారం ప్రకారం బీజేపీ కూటమికి 200 ప్లస్ సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందని సిద్ధరామయ్య చెప్పారు. వారు సొంతంగా అధికారంలోకి రాలేరని ఆయన పునరుద్ఘాటించారు. ఈసారి బీజేపీకి సీట్లు తగ్గడానికి గల కారణాలు ఆయన వివరిస్తూ.. 2014 నుంచి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ప్రధాని నరేంద్రమోడీ నెరవేర్చలేదని చెప్పారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల ఈ రెండూ ప్రధాన సమస్యలని ఆయన తెలిపారు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో కర్ణాటకలో తమ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని నిలుపుకుంటుందని చెప్పారు. తాము 15 నుంచి 20 సీట్లు గెలుచుకుంటామని సిద్ధరామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తారా అన్న ఊహాగానాలపై స్పందిస్తూ.. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా ముందుకెళతానని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత తాను ఎన్నికల రాజకీయాల్లో ఉండనని, కానీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని సిద్ధరామయ్య చెప్పారు.