యువకులకు ఉద్యోగాలు లేవని పిల్లనివ్వడం లేదు.. శరద్ పవార్ కామెంట్స్
ఉద్యోగాలు లేని యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో యువకులకు సకాలంలో పెళ్లిళ్లు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కల్పించని ప్రభుత్వాన్ని నిలదీయాలని యువకులకు పవార్ సూచించారు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని, ఉద్యోగాలు లేని యువకులకు ఎవరూ పిల్లను ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కామెంట్స్ చేశారు. అందుకే దేశంలో యువకులకు సకాలంలో వివాహాలు జరగడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా మహారాష్ట్రలో ఎన్సీపీ జన్ జాగర్ యాత్ర ప్రచారంలో పాల్గొన్న ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రమైనట్లు చెప్పారు. అయితే ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రెండు వర్గాల ప్రజల మధ్య చీలిక తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్న నాయకులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల హామీలు నెరవేర్చే దమ్ము లేక బీజేపీ మతాల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు. ఉన్నత చదువులు చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలు దొరకడం లేదని పేర్కొన్నారు. దీంతో రోజు రోజుకూ దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోందన్నారు.
ఉద్యోగాలు లేని యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో యువకులకు సకాలంలో పెళ్లిళ్లు జరగడం లేదని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కల్పించని ప్రభుత్వాన్ని నిలదీయాలని యువకులకు పవార్ సూచించారు. ప్రభుత్వం రైతుల శ్రమకు తగ్గ గిట్టుబాటు ధర కల్పించకుండా దళారుల ప్రయోజనాలు కాపాడుతోందని మండిపడ్డారు. మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించిందని, అయితే షిండే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని పవార్ మండిపడ్డారు.