3..2..1.. రాకెట్ ప్రయోగాల కౌంట్ డౌన్ చెప్పే ఆ వాయిస్ ఇక వినిపించదు.. ఎందుకంటే..
ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్‌గా పని చేసే డాక్టర్ ఎన్.వలర్‌మతి ప్రతీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ చెప్తుంటారు.
ఇప్పుడు భారతీయులంతా ఇస్రో విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు. చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత రాకెట్ ప్రయోగం అనగానే టీవీల ముందుకు వచ్చేస్తున్నారు. గతంలో కూడా ఇస్రో అనేక ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. కానీ చంద్రయాన్ విజయం తర్వాత ఇస్రోకు సంబంధించిన ప్రతీ ప్రయోగంపై భారతీయులకు ఆసక్తి పెరిగింది. రెండు రోజుల క్రితమే ఆదిత్య-ఎల్1 కూడా విజయవంతంగా ప్రయోగించింది. ప్రస్తుతం ఆ ఉపగ్రహం కక్ష్యలో పరిభ్రమిస్తోంది. కాగా, రాకెట్ ప్రయోగాలను నిత్యం చూసే వారు లైవ్‌లో కౌంట్‌డౌన్ వినే ఉంటారు. ప్రయోగానికి ముందు 10 నుంచి 1 వరకు లెక్కపెడుతూ.. మనల్లో ఆసక్తిని కలిగించే ఆ వాయిస్.. ఇస్రోకి చెందిన ఒక మహిళా ఉద్యోగిది.
ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్‌గా పని చేసే డాక్టర్ ఎన్.వలర్‌మతి ప్రతీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ చెప్తుంటారు. గత కొన్నేళ్లుగా ఇస్రో నిర్వహిస్తున్న ప్రతీ ప్రయోగంతో పాటు చంద్రయాన్-3కి కూడా వలర్‌మతినే కౌంట్‌డౌన్ చెప్పారు. అయితే ఇకపై ఆమె వాయిస్ మనకు వినిపించదు. ఇస్రోలో పని చేస్తున్న డాక్టర్ వలర్‌మతి శనివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటుతో చెన్నైలో మృతి చెందారు. చంద్రయాన్-3కి ఆమె చివరి సారిగా కౌంట్‌డౌన్ చెప్పారు. కాగా, వలర్‌మతి మృతిని ఇస్రో మాజీ డైరెక్టర్ డాక్టర్ పీవీ వెంకటకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్)లో ధ్రువీకరించారు.
'వలర్‌మతి స్వరాన్ని శ్రీహరికోటలో జరిపే ఇస్రో మిషన్స్ కౌంట్‌డౌన్‌లో ఇకపై వినిపించదు. చంద్రయాన్ 3 ఆమె చివరి మిషన్. అనుకోకుండా ఆమె మనలను వదిలి వెళ్లిపోయారు. చాలా బాధగా ఉన్నది.' అంటూ డాక్టర్ వెంకటకృష్ణన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. వరల్‌మతి మృతి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది ఆమెకు నివాళి అర్పిస్తున్నారు. వలర్‌మతి వాయిస్ ఇకపై వినపించదని తెలిసి చాలా బాధగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు.
1959 జూలై 31న తమిళనాడులో జన్మించిన వలర్‌మతి.. ఇస్రోలో 1984లో చేరారు. అనేక మిషన్ ప్రోగ్రామ్స్‌లో ఆమె భాగస్వామిగా ఉన్నారు. ఇండియా తొలిసారిగా డవలప్ చేసిన రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (ఆర్ఐఎస్) తయారీలో ఆమెదే కీలక పాత్ర. రిశాట్ (ఆర్ఐశాట్)-1కు ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆర్ఐశాట్-1ను ఇస్రో 2012 ఏప్రిల్‌లో విజయవంతంగా ప్రయోగించింది.