బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్‌ను తన భర్తే హత్య చేశాడని మహిళ ఫిర్యాదు
తన భర్తకు కౌశిక్ 15 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాడని, ఆ డబ్బుల కోసం కౌశిక్ తన భర్తపై తీవ్ర వత్తిడి చేస్తుండటంతో ఆయనను వదిలించుకోవడానికి హత్య చేశాడని ఆమె ఆరోపించింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు-దర్శకుడు సతీష్ కౌశిక్ మృతి కేసు మరో మలుపు తిరిగింది. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య , కౌశిక్‌ను తన భర్త రూ. 15 కోట్ల కోసం హత్య చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది.
తన భర్తకు కౌశిక్ 15 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాడని, ఆ డబ్బుల కోసం కౌశిక్ తన భర్తపై తీవ్ర వత్తిడి చేస్తుండటంతో ఆయనను వదిలించుకోవడానికి హత్య చేశాడని ఆమె ఆరోపించింది.
తన భర్త కొన్ని ప్రమాదకరమైన మాత్రలతోనే కౌశిక్‌ను హత్య చేశాడని ఆమె తన పిర్యాదులో పేర్కొంది.
అంతకుముందు శనివారం, ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ, కౌశిక్ మరణానికి ముందు పార్టీకి హాజరైన ఢిల్లీలోని ఫామ్‌హౌస్ నుండి కొన్ని 'ఔషధాలను' స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ఆ మహిళ చెప్పిన వివరాల ప్రకారం...
తాను మార్చి 13, 2019న వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నానని, తన భర్త ద్వారా కౌశిక్‌తో తనకు పరిచయం ఏర్పడిందని, కౌశిక్ భారత్, దుబాయ్‌లో తమను క్రమం తప్పకుండా కలుసేవాడని మహిళ పేర్కొంది.
2022 ఆగస్టు 23న కౌశిక్ దుబాయ్‌లోని తమ ఇంటికి వచ్చి తన భర్త నుంచి రూ.15 కోట్లు తిరీగి ఇవ్వాలని డిమాండ్ చేశాడని ఆమె పేర్కొంది.
"నేను డ్రాయింగ్ రూమ్‌లో ఉన్నాను, అక్కడ కౌశిక్, నా భర్త ఇద్దరూ వాగ్వాదానికి దిగారు, కౌశిక్ నా భర్తకు రూ. 15 కోట్లు ఇచ్చి మూడేళ్లు అయిందని,తనకు చాలా డబ్బు అవసరమని, తనను మోసం చేశావని, తన డబ్బులు తనకు వెంటనే ఇచ్చేయాలని ఆగ్రహంగా మాట్లాడాడాని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
దుబాయ్‌లో జరిగిన పార్టీలో తీసుకున్న తన భర్త, కౌశిక్‌ల ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుమారుడు కూడా పార్టీలో ఉన్నాడని మహిళ ఆరోపించింది.
"నా భర్త కౌశిక్‌కి త్వరలో డబ్బు తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశాడు. నేను నా భర్తను విషయం ఏమిటని అడిగినప్పుడు, అతను కోవిడ్ మహమ్మారి సమయంలో డబ్బును పోగొట్టుకున్నానని చెప్పాడు. నా భర్త కౌశిక్‌ని వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు." తన భర్త రకరకాల డ్రగ్స్‌తో డీల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
డబ్బు విషయమై 2022 ఆగస్టు 24న కౌశిక్‌తో తన భర్త తీవ్ర వాగ్వాదానికి దిగినట్లు తన ఫిర్యాదులో ఆమె పేర్కొంది.
''ఇప్పుడు కౌశిక్ మరణవార్త చదివాను. నా భర్త తన సహాయకులతో కలిసి కౌశిక్‌ను కుట్ర చేసి చంపాడని నేను పూర్తిగా అనుమానిస్తున్నాను.’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది..
ఈ విషయమై సంబంధిత పోలీసు అధికారులను మీడియా అడిగినా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
అయితే ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి హాజరైన 25 మందిని పోలీసులు విచారణకు పిలిపించనున్నట్లు సమాచారం.