'నా తండ్రి స్వేచ్ఛ విచ్ఛిన్నమైంది': స్వాతంత్య్ర దినం ప్రసంగంలో బాలిక ఆవేదన
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత బాలికపై అగ్రకుల మూక అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నసిద్ధిక్ కప్పన్ అనే జర్నలిస్టును యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచీ జైల్లో మగ్గుతున్న తన తండ్రి గురించి, ఈ దేశం గొప్పతనం గురించీ కప్పన్ 9 ఏళ్ళ కూతురు ఉద్వేగభరితంగా ప్రసంగించింది.
"నా పేరు మెహనాజ్ కప్పన్. స్వేచ్ఛను విచ్ఛిన్నం చేసి చీకటి గదిలోకి నెట్టబడిన పౌరుడు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్ కుమార్తెను." ఆగస్టు 15, సోమవారం నాడు సిద్ధిక్ కప్పన్ 9 ఏళ్ల కుమార్తె తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని ఇలా ప్రారంభించింది.
సిద్ధిక్ కప్పన్ ఢిల్లీకి చెందిన ఒక మలయాళీ జర్నలిస్ట్, ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో అగ్రకుల మూక ఓ దళిత బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటనను రిపోర్ట్ చేయడానికి హత్రాస్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతనిపై మొదట శాంతి విఘాతం కింద కేసు నమోదు చేసి, ఆ తర్వాత UAPA కింద మరో కేసు నమోదు చేశారు. అక్టోబర్ 2020 నుండి అతను జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి అతని విడుదల కోసం అతని భార్య, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (KUWJ) పోరాడుతూనే ఉన్నారు. తన తండ్రి జైలుకు వెళ్ళినప్పటి నుండి ఆ 9 ఏళ్ళ చిన్నారి బుర్రలో ఎన్ని భూకంపాలు బద్దలయ్యుంటాయో అందుకే స్వాతంత్య్ర దినోత్సవ రోజు తాను చదువుతున్న నోటపరం GLP ప్రభుత్వ పాఠశాలలో ఉద్వేగభరితంగా ప్రసంగించింది.
"భారతదేశం చాలా గొప్ప దేశం. తన 76వ స్వాతంత్య్ర సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ గొప్ప సందర్భంగా, తిరుగులేని గర్వంతో అన్ని హక్కులు కలిగిన భారతీయురాలిగా నేను ఇలా చెబుతున్నాను.. భారత్ మాతా కీ జై. గాంధీజీ, నెహ్రూ, భగత్ సింగ్, అసంఖ్యాక గొప్ప విప్లవకారుల త్యాగాల ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం అని ఆమె అన్నారు.
ఆమె తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... "ఈ రోజు ప్రతి భారతీయుడికి ఒక హక్కు ఉంది,ఒక ఎంపిక ఉంది.వారు ఏమి మాట్లాడాలి, ఏమి తినాలి, ఏ మతాన్ని ఎంచుకోవాలి. వీటన్నింటిలో వారికి ఎంపిక, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా ఈ దేశం వదిలి వెళ్లిపోమని అడిగితే ఎదిరించే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. ఆగస్టు 15న స్వాతంత్య్రం పొందిన భారతదేశం ఎవరి ముందు రాజీపడకూడదు. అయితే, నేటికీ కొన్నిచోట్ల అశాంతి నెలకొంది. మతం, కులం, రాజకీయాల ఆధారంగా చెలరేగుతున్న హింసలో ఇది ప్రతిబింబిస్తోంది. వీటన్నింటిని మనమందరం కలిసి ప్రేమ, ఐక్యతతో ఓడించాలి. అందరం కలిసి అశాంతిని తుడిచివేయాలి. "
"మనం ఇంకా భారతదేశాన్ని అత్యుత్తమ శిఖరాగ్రానికి తీసుకెళ్లాలి. విభజన, వైషమ్యాలు లేని అద్భుతమైన రేపటి గురించి కలలు కనాలి. భారతదేశ స్వాతంత్య్ర కోసం పోరాడిన వీర దేశభక్తులందరినీ స్మరించుకుంటూ, భారతదేశంలోని సాధారణ పౌరుల స్వేచ్ఛను హరించరాదని చెప్తూ ఇక్కడితో నా ఉపన్యాసాన్నిఆపేస్తున్నాను. జై హింద్, జై భారత్" అని ఆ బాలిక ఉద్వేగ భరితంగా చెప్పింది.
పాలకులు చేస్తున్న అన్యాయాలను బైటపెడుతున్నందుకు ఓ జర్నలిస్టునో, ఓ మేదావినో, ఓ రచయితనో, కళాకారుడినో, లేక సాధారణ పౌరుడినో జైలు పాలు చేసి హింసలపాలు చేస్తున్న ఈ దేశంలో ఈ చిన్నారి మాటలు వినేవాళ్ళున్నారా ?