కత్తితో ఒకరినొకరు పొడుచుకున్న తల్లీకూతురు..

మార్కులు తక్కువ వచ్చాయని మందలించిందన్న కోపంతో సాహితి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి తల్లిని నాలుగు సార్లు పొడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన పద్మజ కుమార్తెపై ఎదురుదాడికి దిగింది.

Advertisement
Update:2024-04-30 08:41 IST

పబ్లిక్ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే పిల్లల్ని తల్లిదండ్రులు మందలించడం చూస్తుంటాం. అయితే ఈ సందర్భంలో విద్యార్థులు తల్లిదండ్రులకు ఎదురు తిరిగి ప్రశ్నించడం అంతగా కనిపించదు. కానీ కర్ణాటకలో ఓ విద్యార్థిని తనకు తక్కువ మార్కులు వచ్చినందుకు తల్లి మంద‌లించింద‌ని, ఏకంగా కత్తి తీసుకొని తల్లిపై దాడి చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి కూడా కత్తితో కుమార్తెను పొడిచింది. ఈ ఘటనలో తల్లికి తీవ్ర గాయాలు కాగా.. కుమార్తె మాత్రం మరణించింది.

బెంగళూరు నగరంలోని బనశంకరి పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మజ(40) తన కుమార్తె సాహితి(17)తో కలిసి నివసిస్తోంది. సాహితి ఇటీవల కర్ణాటక మాధ్యమిక విద్య(పీయూసీ - ఇంటర్మీడియట్ సమాన) పరీక్షలు రాసింది. ఆ పరీక్ష ఫలితాలు సోమవారం వెళ్లడయ్యాయి. ఈ పరీక్షల్లో సాహితికి మార్కులు తక్కువ రావడంతో తల్లి పద్మజ ఈ విషయమై కూతురిని ప్రశ్నించింది.

మార్కులు తక్కువ వచ్చాయని మందలించిందన్న కోపంతో సాహితి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి తల్లిని నాలుగు సార్లు పొడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన పద్మజ కుమార్తెపై ఎదురుదాడికి దిగింది. ఆమె కూడా కత్తి తీసుకుని కుమార్తెను పొడిచింది. ఈ ఘర్షణలో తల్లి కూతురికి తీవ్ర గాయాలు కాగా.. సాహితి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాల పాలైన పద్మజను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని తల్లి కూతురు ఒకరినొకరు పొడుచుకోవడం.. ఈ ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది.

Tags:    
Advertisement

Similar News