ఉప్పు లాగించేస్తున్న భారతీయులు.. తలకి 3 గ్రాములు ఎక్స్ ట్రా
సర్వేలో భాగంగా పరిశోధకులు మొత్తం 3000 మంది భారతీయులపై ప్రయోగం చేపట్టారు. వారి శరీరంలోని సోడియం స్థాయిలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
డాక్టర్లు చెప్పే ఆరోగ్య జాగ్రత్తల్లో ఉప్పు, కారం కాస్త తక్కువగా తినండి అనేది కామన్ పాయింట్. వీలయితే స్వీట్స్ కి దూరంగా ఉండండి అని కూడా చెబుతారు. ఏ వయసువారయినా, ఏ వ్యాధిగ్రస్తులకయినా ఇవి సహజంగా చెప్పే హెచ్చరికలు. కానీ భారతీయుల ఉప్పు వాడకం మాత్రం కంట్రోల్ తప్పుతోందని పరిశోధనలు చెబుతున్నాయి. నేచర్ పోర్ట్ ఫోలియో అనే జర్నల్ లో భారతీయుల ఉప్పు వాడకం ప్రమాదకర స్థాయిలో ఉందని పరిశోధనా పత్రాలు వెలుగు చూశాయి.
ఎంత తినాలి..?
కూరల్లో రుచికోసం ఉప్పు వాడటం సహజం. పెరుగు అన్నంలో ఉప్పు వేసుకోవడం కూడా సహజం. ఇలా కూరల్లో, పెరుగు, మజ్జిగలో ఉప్పు ఎంత వాడాలన్నదానికి ఓ లిమిట్ ఉంది. నిపుణుల సూచన ప్రకారం ఒక మనిషి రోజుకి సగటున 5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి ప్రమాదం.
ఎంత తీసుకుంటున్నాం..?
లిమిట్ 5 గ్రాములు అని నిపుణులు చెబితే, అంతకు మించి లాగించేస్తున్నారు భారతీయులు. కూరల్లో ఉప్పు, పచ్చడిలో ఉప్పు, పెరుగన్నంలో ఉప్పు.. ఇలా మొత్తంగా రోజుకి సగటున 8 గ్రాముల ఉప్పు తింటున్నారు. అంటే 3 గ్రాములు ఎక్స్ ట్రా అన్నమాట. 3 గ్రాముల ఉప్పే కదా అనుకోవద్దు, అదే మీ గుండెకు పెద్ద ముప్పుగా మారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. వంటింట్లో వండటం తగ్గిపోయి, హోమ్ డెలివరీలు, పార్శిళ్లు పెరిగిపోయిన తర్వాత రుచికోసం హోటళ్లలోవారు వేసినంత ఉప్పు మనం తినాల్సిందే. అలా తిన్నామంటే మన అనారోగ్యాన్ని మనం కొనుక్కున్నట్టే లెక్క.
సర్వేలో భాగంగా పరిశోధకులు మొత్తం 3000 మంది భారతీయులపై ప్రయోగం చేపట్టారు. వారి శరీరంలోని సోడియం స్థాయిలను పరిశీలించారు. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. స్థూలకాయులు అత్యధికంగా రోజుకు 9.2 గ్రాముల ఉప్పు తింటున్నట్లు అధ్యయనంలో తేలింది. రక్తపోటు ఉన్న వారు రోజుకు 8.5 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారు. స్త్రీల కంటే పురుషులు ఎక్కువగా ఉప్పు తీసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. సగటున భారతీయ పురుషులు రోజుకు 8.9 గ్రాముల ఉప్పును తీసుకుంటుంటే, మహిళలు 7.9 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నట్టు తేలింది. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే అధిక రక్తపోటు, గుండె, మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు రావడం తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు.