మోడీ చెప్పిన న్యూ ఇండియా 2022 అంతా బోగస్ - ఈ నిజాలు ఒక్క సారి చూడండి

2022 కల్లా దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తానని ప్రధాని నరేంద్ర‌ మోడీ ప్రకటించి చాలా కాలమే అయ్యింది. మరి 2022 కల్లా ఆయన చేస్తానని హామీ ఇచ్చిన పనుల్లో ఒక్కటైనా జరిగిందా ? నిజాలేంటి ?

Advertisement
Update: 2022-10-10 08:08 GMT

ప్రధాని మోడీ అధికార‍ంలోకి వచ్చి 8 ఏళ్ళు గడిచిపోయింది. వచ్చినప్పటి నుం చి ఇప్పటి వరకు ఆయన ఈ దేశ ప్రజలకు అనేక హామీలిచ్చారు. వాటిలో కొన్నైనా అమలు చేశారా ? ఆయన అమలుపర్చిన కార్యక్రమాలు ఆయన చెప్పిన టార్గెట్ పూర్తి చేశాయా ? పెద్ద నోట్ల రద్దుతో నల్ల ధనం పోతుందని, ఉగ్రవాదం, తీవ్రవాదం లేకుండా పోతుందన్న ఆయన మాటలు నిజమయ్యాయా ? విదేశాల నుంచి నల్ల ధనం వెనక్కి రప్పించి దేశంలోని ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న ఆయన హామీ ఏమయ్యింది? ఇలా మోడీ ఇచ్చిన ముఖ్యమైన హామీలు ఏవైనా అమలయ్యాయా ? 2022 కల్లా తాను ఖ‌చ్చితంగా చేసి తీరుతానని హామీ ఇచ్చిన అంశాల గతి ఏమైంది ? ఒక్క సారి చూద్దాం.

1 ప్రధాని మోడీ 2022 కల్లా దేశంలోని రైతులందరి ఆదాయం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు.

జరిగిందేమిటి ? 2015-16లో మోదీ ఈ హామీ ఇచ్చిన నాటికి ఒక్కో రైతు సగటు ఆదాయం నెలకు రూ.8,059గా ఉండేది. ద్రవ్యోల్బణం బట్టి రైతుకు నెల ఆదాయం ప్రస్తుతం రూ.21,146 గా ఉండాలి. కానీ 77వ నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం.. సగటున రూ.10,218 కంటే తక్కువగా ఉన్నది. ఆదాయంకంటే ఖర్చు రెట్టింపు అయింది.

2, ప్రతి భారతీయుడికి బ్యాంకు ఖాతా, జీవిత, ప్రమాద బీమా, రిటైర్మెంట్ ప్లాన్ సర్వీసెస్ కల్పిస్తానన్నారు మోడీ

జరిగిందేంటి ?

దేశంలో బ్యాంకు ఖాతా లేని వాళ్లు 21 కోట్లు. ప్రతీ వంద మందిలో ముగ్గురికే జీవిత బీమా పాలసీ ఉన్నది. 35% మందికి ప్రమాద బీమా లేదు. 40 కోట్ల మంది పెన్షన్, రిటైర్మెంట్ ప్లానింగ్ సర్వీసెస్ పరిధిలో లేరు.

3. దేశంలోని ప్రతి రైతు భూమికి సాగునీళ్ళిస్తాను అనిచెప్పారు

జరిగిందేంటి ?

2015లో ప్రకటించిన 'హర్ ఖేత్ కోపానీ' స్కీమ్ ఏమైందో తెలియదు. దాని గురించి ఇప్పటి వరకు మళ్ళీ మాట్లాడలేదు.

4. ప్రతి ఇంటికీ వంట గ్యాస్ అందిస్తాం అనిచెప్పారు

జరిగిందేంటి ?

ఇప్పటికీ 21కోట్ల మంది గ్యాస్ సిలిండర్ కు దూరంగా ఉన్నారు. 2014లో గ్యాస్ ధర రూ.410 ఉంటే ఇప్పుడు రూ.1,105గా ఉన్నది. దాంతో 5 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు వదులుకున్నారు.

5. ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం అందజేస్తామన్నారు

జరిగిందేంటి ?

నీతి ఆయోగ్, స్మార్ట్ పవర్ ఇండియా సర్వే ప్రకారం.. దేశంలో ఇంకా 13%ఇళ్ళ‌కు విద్యుత్తు సౌకర్యం లేదు.

6.జీడీపీ 10 శాతానికి పెంచుతాం అని గొప్పగా ప్రకటించారు

జరిగిందేంటి ?

ప్రస్తుతం జీడీపీ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారమే 7.8 శాతంగా ఉన్నది.

7. 2022 కల్లా ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు మోడీ

జరిగిందేంటి ?

రిక్స్ నైట్ ఫ్రాంకో నివేదిక ప్రకారం .. ప్రతి ఇద్దరిలో ఒకరికి

సొంతిల్లు లేదు.

8. ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మిస్తామన్నారు

జరిగిందేంటి ?

జాతీయ కుటుంబ సర్వే ప్రకారం... 19.4% కుటుంబాలకు ఇప్పటికీ మరుగుదొడ్డి లేదు.

9. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ ఇస్తాం

జరిగిందేంటి ?

25,067 గ్రామాలకు ఇంటర్నెట్ లేదు.

10. 100 శాతం డిజిటల్ లిటరసీ కల్పిస్తాం

జరిగిందేంటి ?

ఇప్పటికీ 30 శాతం మందికి డిజిటల్ లిటరసీపై అవగాహన లేదు.

11.ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి నల్లా కనెక్షన్ ఇస్తాం

జరిగిందేంటి ?

50% మందికి నల్లా కనెక్షన్ లేదు.

12.దేశాన్ని పోషకార లోప రహితంగా మారుస్తాం

జరిగిందేంటి ?

ఇప్పటికీ 70% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధ పడుతున్నారు.

13.రైలు ప్రమాదాల్లో ఒక్కరు కూడా మరణించకుండా చర్యలు చేపడతాం

జరిగిందేంటి ?

ఈ ఏడాది 13వేల రైలు ప్రమాదాలు జరిగాయి. అందులో 12వేల మంది మృతి చెందారు

14.ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

జరిగిందేంటి ?

ఏం చేయలేక చేతులెత్తేశారు.

15.2017, 18 లో 29 శాతం పెట్టుబడి రేటును 36 శాతానికి పెంచుతాం

జరిగిందేంటి ?

గడిచిన నాలుగేండ్లలో భారత్ లో పెట్టుబడి రేటు కేవలం ఒక్క శాతమే పెరిగింది.

16. పంట వ్యర్థాల దహనాన్ని తగ్గించి వాయుకాలుష్యాన్ని తగ్గిస్తాం

జరిగిందేంటి ?

ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నది. ప్రభుత్వం చేతులెత్తేసింది.

17. గాలిలో పీఎం (పార్టికుక్యులేట్ మ్యాటర్) 2.5 ను 50 మైక్రాన్లకు తగ్గిస్తాం

జరిగిందేంటి ?

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఢిల్లీతోపాటు అనేక నగరాల్లో పీఎం స్థాయి ఇప్పటికీ 300కు పైనే ఉన్నది.

18.మరుగు దొడ్లలో మల మూత్రాలను మనుషులు తొలగించే విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తాం.

జరిగిందేంటి ?

ప్రభుత్వ లెక్కల ప్రకారం 42,303 మంది ఇప్పటికీ అశుద్ధాన్ని ఎత్తిపోస్తున్నారు. నిజానికి ఈ పని చేస్తున్న వాళ్ళు లక్ష దాటొచ్చని ఎన్జీవోలు చెప్తున్నాయి.

19.అడవుల విస్తీర్ణాన్ని 21 శాతం నుంచి 33 శాతానికి పెంచుతాం

జరిగిందేంటి ?

దేశంలో అడవుల విస్తీర్ణం 8 ఏండ్లలో పెరిగింది కేవలం 0.71 శాతమే.

వీటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉంది. ఇలాంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిమరల్చడానికి మతం , భాష వంటి లేని సమస్యలను ముందుకు తీసుకవచ్చి ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చ గొట్టే కార్యక్రమం బహువేగంగా, ప్రణాళిక బద్దంగా సాగుతున్నది.

మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే కాక కొన్ని రాష్ట్రాల పట్ల వివక్ష‌ చూపించడం వల్ల రాష్ట్రాలు చాలా నష్టపోతున్నాయి. దానికి పెద్ద ఉదహరణ తెలంగాణ. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకపోవడం, ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల నష్టపోతున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రధానిపైనే ఉంది.

Tags:    
Advertisement

Similar News