హాస్పిటల్‌లో గన్‌తో ఎమ్మెల్యే హల్‌చల్
రివాల్వర్‌ను చేతిలో పట్టుకోకుండా బొడ్డులో దోపుకొని తిరగమంటారా అంటూ రివర్స్ అయ్యారు.
అతను భాధ్యతాయుతమైన ఒక ప్రజా ప్రతినిధి. ఎమ్మెల్యే హోదా కలిగిన వ్యక్తి ప్రవర్తనను ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారు. అలాంటప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ.. ఇదంతా మరిచిపోయిన ఒక ఎమ్మెల్యే చేతిలో గన్ పట్టుకొని ఏకంగా ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ కాసేపు హల్ చల్ చేశాడు. గన్ పట్టుకొని బహిరంగంగా ఎందుకు తిరుగుతున్నావని ప్రశ్నించినందుకు తలపొగరు సమాధానం ఇచ్చాడు. ఈ ఘటన బీహర్‌లో చోటు చేసుకుంది.
బీహార్‌లోని గోపాల్‌పూర్ జేడీ(యూ) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మంగళవారం భగల్‌పూర్‌లోని జవహర్ లాల్ నెహ్రు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు వచ్చారు. తన మనుమరాలి సీటీ స్కాన్ కోసం వచ్చిన గోపాల్ మండల్ అక్కడ కాసేపు వేచి చూశారు. ఆ సమయంలో ఆయన చేతిలో ఒక రివాల్వర్ పట్టుకొని ఉన్నారు. ఆసుపత్రిలో ఇలా రివాల్వర్ చేతిలో పట్టుకొని తిరగవద్దని అక్కడి సిబ్బంది అతడిని వారించారు.
రివాల్వర్‌ను ఇలా పట్టుకొని తిరగడం నా స్టైల్ అని గోపాల్ మండల్ అన్నారు. అంతే కాకుండా.. రివాల్వర్‌ను చేతిలో పట్టుకోకుండా బొడ్డులో దోపుకొని తిరగమంటారా అంటూ రివర్స్ అయ్యారు. తనకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని.. తాను ఇలాగే ఉంటానని ఖరాఖండీగా చెప్పేశారు. కాగా, కొంత మంది దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రిలో రివాల్వర్ పట్టుకొని తిరగడంపై తీవ్రమైన విమర్శలు రావడంతో గోపాల్ మండల్ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. గతంలో నా వెనుక అనేక మంది క్రిమినల్స్ పడేవారు. వారి నుంచి రక్షించుకోవడానికే గన్ పట్టుకొని తిరిగే వాడిని. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా పడుతున్నారు. నేను రాబోయే ఎన్నికల్లో ఎంపీని కాబోతున్నట్లు వారు గ్రహించారు. అందుకే నా వెనుక రాజకీయ నాయకులు పడుతున్నారని గోపాల్ మండల్ చెప్పారు. నా ఆత్మరక్షణ కోసమే ఇలా రివాల్వర్ పట్టుకొని తిరుగుతున్నానని సమర్థించుకున్నారు.
నన్ను ఎవరైనా ఏమైనా చేయాలని సాహసం చేస్తే వాళ్లను కాల్చేస్తానని చెప్పారు. మా నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు నా సామాజిక వర్గానికి చెందిన వాళ్లే ఉన్నారు. వారందరూ నాకే ఓటేసి ఎంపీని చేయబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే నా రక్షణ కోసం ఎక్కడికి పోయినా రివాల్వర్ చేతులో ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు.
♦