ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు
భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బైటికి పరుగులు పెట్టిన ప్రజలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని రంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్‌లలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాలతో పాటు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లిలో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణంతో నందిగామ, ఏలూరు సహా విశాఖ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బైటికి పరుగుపెట్టారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.