శాంతించిన మణిపూర్, కర్ఫ్యూ సడలింపు.. కానీ..!
ఇతర రాష్ట్రాలనుంచి వలస వచ్చి ఉంటున్నవారు మణిపూర్ ని ఖాళీ చేసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పరిస్థితులు కుదుటపడ్డాయనే ప్రకటనలు వినపడుతున్నా కూడా జనంలో భయం మాత్రం తగ్గలేదు.
మణిపూర్ లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గాయి. గడచిన 24 గంటల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది. తూర్పు ఇంఫాల్, పశ్చిమ ఇంఫాల్ సహా 11 జిల్లాల్లో విధించిన కర్ఫ్యూను పోలీసులు సడలించారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. ఆ సమయంలో నిత్యావసర వస్తువుల కొనుగోలుకి అవకాశమిస్తున్నారు. కర్ఫ్యూ సడలింపు వేళలు ముగిసిన వెంటనే పోలీసులు తిరిగి రంగంలోకి దిగుతున్నారు. ఎక్కడికక్కడ జనాలను రోడ్లపైనుంచి ఖాళీ చేయిస్తున్నారు.
మణిపూర్ మాకొద్దు బాబోయ్..
ఇతర రాష్ట్రాలనుంచి వలస వచ్చి ఉంటున్నవారు మణిపూర్ ని ఖాళీ చేసి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పరిస్థితులు కుదుటపడ్డాయనే ప్రకటనలు వినపడుతున్నా కూడా జనంలో భయం మాత్రం తగ్గలేదు. ఇంఫాల్ విమానాశ్రయం కెపాసిటీ 750. కానీ ఇప్పుడు అక్కడ 2వేలమందికి పైగా పడిగాపులు పడుతున్నారు. చిన్నారులు, యువకులు, వృద్ధులు.. అందరూ రాష్ట్రం వదిలిపెట్టి తరలిపోవడానికి సిద్ధమయ్యారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాల్లో తరలించాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా అలాగే వెనక్కి వెళ్లిపోయారు. ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్న అధికారులు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రాణ నష్టంపై స్పష్టమైన అంచనాలు లేవు. దాదాపు 60మంది అల్లర్ల కారణంగా చనిపోయారని అంటున్నారు. ఆందోళనకారులు శాంతించినట్టే కనిపించినా తమకు స్పష్టమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా ఇరకాటంలో పడింది. ఎస్టీ రిజర్వేషన్లపై వెనక్కు తగ్గితే మైతై వర్గం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. లేకపోతే గిరిజనుల ఆందోళనలు కొనసాగేలా ఉన్నాయి.