ముంబైలో దారుణం: ప్రియురాలిని ముక్కలుగా నరికి ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన ప్రియుడు
తనకు సరసతికి మధ్య గొడవ జరగడంతో ఆమెను హత్య చేసినట్లు మనోజ్ అంగీకరించాడు. ఆ తర్వాత చెట్లను నరికే యంత్రాన్ని కొనుక్కొని వచ్చి దాని సహాయంతో సరస్వతి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు చెప్పాడు.
ఢిల్లీలో ఆఫ్తాబ్ పూనావాలా అనే యువకుడు తన ప్రియురాలు శ్రద్ధ వాకర్‌ను ముక్కలు ముక్కలుగా నరికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరి వేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత ఇటువంటి తరహాలోనే దేశవ్యాప్తంగా పలు సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ముంబైలో కూడా ఇటువంటి దారుణమే జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని ప్రియుడు ముక్కలు ముక్కలుగా నరికి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ముంబై నగరం మీరా రోడ్డు వద్ద ఉన్న గీతా ఆకాశ్ దీప్ సొసైటీలోని ఏడవ అంతస్తులో 56 ఏళ్ల మనోజ్ సహానీ, 36 ఏళ్ల సరస్వతి వైద్యతో సహజీవనం చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వీరు ఇక్కడే ఉంటున్నారు.
అయితే వీరు ఉంటున్న ప్లాట్ నుంచి దుర్వాసన వస్తుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సొసైటీ వద్దకు చేరుకొని మనోజ్ ఇంటి తలుపులు తట్టారు. అతడు వచ్చి తలుపు తీయగానే ఇంట్లో నుంచి విపరీతంగా దుర్వాసన వచ్చింది. పోలీసులు ఇల్లంతా వెతుకగా వారికి మహిళ మృతదేహపు ముక్కలు కనిపించాయి. పోలీసులు మనోజ్‌ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అవి తన ప్రియురాలు సరస్వతి శరీరం ముక్కలని తెలిపాడు.
తనకు సరసతికి మధ్య గొడవ జరగడంతో ఆమెను హత్య చేసినట్లు మనోజ్ అంగీకరించాడు. ఆ తర్వాత చెట్లను నరికే యంత్రాన్ని కొనుక్కొని వచ్చి దాని సహాయంతో సరస్వతి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు చెప్పాడు. ఆ తర్వాత ఆ ముక్కలను ప్రెషర్ కుక్కర్లో ఉడికించినట్లు తెలిపాడు. సాక్ష్యాలను మాయం చేసేందుకే ఈ పని చేసినట్లు మనోజ్ ఒప్పుకున్నాడు.
పోలీసులు సరస్వతి మృతదేహపు ముక్కలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫారెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మనోజ్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ప్రియురాలిని ముక్కలుగా నరికి ప్రెషర్ కుక్కర్లో ఉడికించిన ఘటన వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.