మహాత్మా గాంధీ డిగ్రీ చదవలేదు.. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

చాలా మంది మహాత్మా గాంధీ న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారని భావిస్తుంటారు. కానీ ఆయన ఎలాంటి డిగ్రీ చేయలేదు. కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమే గాంధీజీ కలిగి ఉన్నారని మనోజ్ సిన్హా పేర్కొన్నారు.

Advertisement
Update:2023-03-25 09:08 IST

మహాత్మాగాంధీ ఎలాంటి లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేయలేదని.. కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమే కలిగి ఉన్నారని జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పలు వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎల్జీని ఎడ్యుకేట్ చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఐటీఎం యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి మనోజ్ సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావంతుడు కావాలంటే డిగ్రీ చదవాల్సిన అవసరం లేదని అన్నారు. డిగ్రీ ఉన్న వాళ్లందరినీ విద్యావంతులు అనలేమని చెప్పారు. ఒక వేళ డిగ్రీ లేని వాళ్లను నిరక్షరాస్యుడు అనాల్సి వస్తే ముందుగా మనం మహాత్మా గాంధీని అనాలి. ఎందుకంటే ఆయన ఏ ఒక్క యూనివర్సిటీ డిగ్రీని కూడా కలిగి ఉండలేదు అని మనోజ్ సిన్హా అన్నారు.

చాలా మంది మహాత్మా గాంధీ న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారని భావిస్తుంటారు. కానీ ఆయన ఎలాంటి డిగ్రీ చేయలేదు. కేవలం హైస్కూల్ డిప్లొమా మాత్రమే గాంధీజీ కలిగి ఉన్నారని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఆయనకు డిగ్రీ లేకపోయినా ఒక గొప్ప విద్యావంతుడు అని చెప్పారు. అంతే కాకుండా ఆయన మన జాతిపిత అయ్యారని తెలిపారు. గాంధీ గొప్ప డిగ్రీలు చదవారు అనేదంతా అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. చాలా మంది నా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారని తెలసు. కానీ మనం నిజాలు మాట్లాడుకోవాలి అని ఆయన అన్నారు.

కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గాంధీజీ మునిమనుమడు తుషార్ గాంధీ స్పందించారు. నేను మహాత్మా గాంధీ ఆటో బయోగ్రఫీ బుక్‌ను జమ్ము రాజ్‌భవన్‌కు పోస్టు చేశారని చెప్పారు. ఇది చదవి అయినా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తనను తాను ఎడ్యుకేట్ చేసుకుంటారని ఆశిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ రాజ్‌కోట్‌లోని ఆల్‌ఫ్రైడ్ హైస్కూల్ నుంచి డబుల్ మెట్రిక్యులేషన్ చేశారు. ఇది లండన్‌లోని బ్రిటిష్ మెట్రిక్యులేషన్‌తో సమానం. ఆ తర్వాత లండన్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఇన్నర్ టెంపుల్ కాలేజీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అదే సమయంలో ఆయన లాటిన్, ఫ్రెంచ్ భాషల్లో రెండు డిప్లొమాలు కూడా చేశారు. ఆయన లండన్‌లో లా పూర్తి చేసిన తర్వాత లండన్ బార్ అసోసియేషన్, బాంబే హైకోర్టులో ప్రాక్టీసే చేశారు. మహాత్మా గాంధీ డిగ్రీలు, అనుభవం చూసే సౌతాఫ్రికాకు చెందిన ఒక ప్రైవేటు సంస్థ ఆయనను లీగల్ వర్క్స్ కోసం నియమించుకున్నది. ఈ విషయాలన్నీ ఒక లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తికి తెలియక పోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 


Tags:    
Advertisement

Similar News