హలో..! నేను వందేమాతరాన్ని మాట్లాడుతున్నాను..

వందేమాతరం అనకపోతే జై భీమ్, లేదా జై శ్రీరామ్ అని కూడా పలకరించుకోవచ్చని వెసులుబాటు ఇచ్చారు మంత్రి ముంగంటివార్. హలో అనే పదాన్ని నిషేధించాలని కోరారు.

Advertisement
Update:2022-10-03 09:30 IST

ఇప్పటికే చాలా విషయాలు జనాలపై రుద్దారు, ఇంకో రెండేళ్లు కూడా రుద్దుతారనడంలో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ రుద్దుడు ఇటీవల బాగా ఎక్కువైంది. డ్రస్సుల విషయంలో ఆంక్షలు పెట్టారు, తినే తిండిపై కూడా విమర్శలు చేస్తున్నారు, చివరకు ఫోన్ చేస్తే పలకరింపుగా మాట్లాడే హలో అనే పదాన్ని కూడా నిషేధిస్తున్నామంటే ఎలా..? కానీ మహారాష్ట్రలో బీజేపీ చేతుల్లో ఉన్న షిండే సర్కారు హలో పదాన్ని నిషేధిస్తూ, దాని బదులు వందే మాతరం అనే పదాన్ని పలకాలంటూ 'గవర్నమెంట్ రిజల్యూషన్' (జీఆర్) పాస్ చేసింది. ఇకపై మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు హలో అని సంభాషణ మొదలు పెట్టకుండా వందేమాతరం అని పలకరించుకోవాలని సూచించారు సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్. గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వందేమాతర ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

గతంలో కూడా కొంతమంది బీజేపీ నేతలు ఈ ప్రచారం చేపట్టినా.. దాన్ని ఎవరూ సీరియస్ గా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం రిజల్యూషన్ తీసుకు రావడంతో ఇది చర్చనీయాంశమైంది. వందేమాతరం అనకపోతే జై భీమ్, లేదా జై శ్రీరామ్ అని కూడా పలకరించుకోవచ్చని వెసులుబాటు ఇచ్చారు మంత్రి ముంగంటివార్. హలో అనే పదాన్ని నిషేధించాలని కోరారు. అందులో పాశ్చాత్య భావన ఉందని, దాన్ని మరచిపోవాలన్నారు.

గాంధీజీ హలో అనేవారా..? కాదా..?

మహాత్ముడి జయంతి రోజున ఈ ప్రచారం మొదలు పెట్టిన మహారాష్ట్ర మంత్రి.. గాంధీని కూడా ఈ హలో-వందేమాతరం వ్యవహారంలోకి తీసుకు రావడం విశేషం. గాంధీ మహాత్ముడికి కూడా వందే మాతరం అనే పదం చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు మంత్రి. అంటే మహాత్ముడు బతికుంటే తనని మెచ్చుకునేవారనేది ఆయన కాన్సెప్ట్. అక్కడితో ఆగిపోయారు, గాంధీ కూడా హలో బదులు, వందేమాతరం అనేవాడని చెప్పలేదు అంటూ నెటిజన్లు సదరు మంత్రిపై సెటైర్లు వేస్తున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, దాన్ని కాదనలేం.. అయితే అధికారంలో ఉన్నవారికి ఇలాంటి పిచ్చి ఉంటే మాత్రం దానికి ప్రజలు బలైపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News