హాస్పిటల్‌లో చేరిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే
ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హాస్పిటల్‌లో చేరారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన స్వల్ప అనారోగ్యానికి గురి కావడంతో స్వగ్రామానికి వెళ్లి ఇంట్లోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడకపోవడంతో కుటుంబ సభ్‌యులు థానేలో జూపిటర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాతే ఆయన కోలుకోకపోవడానికి కారణాలేమిటో వెల్లడయ్యే అవకాశముంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి పది రోజులు గడిచింది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరెనేది ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయిస్తారని షిండే ఇది వరకే ప్రకటించారు. షిండే అందుబాటులో లేకపోవడంతోనే మహాయుతి కూటమి సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కే మహారాష్ట్ర సీఎం పగ్గాలు అప్పగించాలనే యోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. దీనిని షిండే సన్నిహితులు వ్యతిరేకిస్తున్నారు. అటు బీజేపీ పెద్దల వ్యవహారశైలి.. ఇటు సీఎం పీఠం దక్కాలంటూ తన అనుచరులు పట్టుబడుతుండటంతో ఆ ఒత్తిడితోనే షిండే అనారోగ్యానికి గురైనట్టు చెప్తున్నారు.