ముగిసిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారం
పోటాపోటీగా ప్రచారం చేసిన అన్ని రాజకీయ పార్టీలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, జార్ఖండ్ అసెంబ్లీలోని 38 స్థానాలకు ఈనెల 20న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్ లో ఈనెల 13న తొలి విడతలో 43 స్థానాలకు ఇప్పటికే పోలింగ్ ముగిసింది. ఇన్ని రోజులుగా హోరాహోరీగా ప్రచారం సాగించిన అన్ని రాజకీయ పార్టీలు ఓటరు తీర్పు కోసం ఎదురు చూడాల్సిన సమయం వచ్చింది. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి తరపున బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బేలాపూర్, అక్కల్‌కోట్‌లో, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గోండియాన, నాగ్‌పూర్‌లో ప్రచారం చేశారు. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ బారామతి, అష్టీ, ఫల్తాన్ ఇందాపూర్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఈనెల 14 మహారాష్ట్ర, 15న జార్ఖండ్ లో ప్రచారాన్ని ముగించారు. హోం మంత్రి అమిత్ షా మణిపూర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తరపున ఎన్‌సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్ పవార్ పూణే, అహిల్యానగర్ లో ప్రచారం చేశారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ, ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహారాష్ట్రలో ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలతో కూడిన మహాయుతి కూటమి అధికారంలో ఉన్నది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ) మహావికాస్ అఘాడీ పేరుతో కూటమి కట్టి బరిలోకి దిగాయి. ఎంఐఎం, ఇతర పార్టీలు చీల్చే ఓట్లు, మహావికాస్ అఘాడీ కూటమిలోని పార్టీలు ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో కొన్ని స్థానాల్లో ముఖాముఖి తలపడటం ఎన్నికల ఫలితాలను ఏమేరకు ప్రభావితం చేస్తుందో చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార మహాయూతికి వ్యతిరేకంగా ఓటర్లు తీర్పునిచ్చారు. ఈనేపథ్యంలో మోదీషా ద్వయం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేశాయి. జార్ఖండ్ లో జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. అక్కడ బీజేపీ గట్టిపోటీ ఇస్తోంది. హేమంత్ సోరేన్ ను జైలుకు పంపడం, జేఎంఎంలో కీలక నేతగా ఉన్న చంపయి సోరేన్ తో తిరుగుబాటు చేయించడంతో ఆ ప్రభావం బీజేపీపై ఎంత మేరకు ఉంటుందన్న చర్చ సాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న రెండు కూటములు తమ సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. రెండు రాష్ట్రాల్లో అధికారం తమదేనన్న దీమాలో ఇండియా కూటమి ఉండగా, మహారాష్ట్రను నిలబెట్టుకుంటామని, జార్ఖండ్ ను గెలుస్తామని కమలం పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.