వ్యభిచార గృహానికి రక్షణ కోరిన న్యాయవాది.. విస్మయానికి గురైన హైకోర్టు
వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదంటూ తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు.
తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ పిటిషన్‌పై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. రాజా మురుగన్ న్యాయవాది అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ వ్యభిచార గృహాన్ని తాను నడుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్‌ను, ఆయిల్ బాత్‌లను తమ సంస్థ అందిస్తోందని రాజా మురుగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా వారిని కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్, న్యాయవాది వాదనతో ఒక్కసారిగా అవాక్కైన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.పుగలేంది దీనిపై మాట్లాడుతూ.. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదంటూ తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్‌కు సూచించారు. అంతేకాదు రాజా మురుగన్‌ను ఆయన లా డిగ్రీ సర్టిఫికెట్, బార్ అసోసియేషన్‌లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించారు. దీంతో పాటు ఆయనకు రూ.10 వేల జరిమానా కూడా విధించారు.