పుట్టేదెవరో తెలుసుకోవడానికి భార్య కడుపు కోశాడు.. - జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
పుట్టబోయే బిడ్డ విషయంలో ఓరోజు భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగక.. పుట్టేది మగబిడ్డేనా.. కాదా అనేది తెలుసుకోవడానికి కొడవలితో భార్య కడుపును చీల్చాడు.
తనకు మగబిడ్డే కావాలంటూ భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి నెలలు నిండకముందే భార్య కడుపు కోసి చూసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పుట్టబోయే మగబిడ్డను కూడా చంపుకున్నాడు. ఈ ఘటనలో ఆ కిరాతకుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తాజాగా తీర్పు చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన పన్నాలాల్ అనే వ్యక్తికి ఐదుగురు సంతానం. వారంతా ఆడపిల్లలే కావడంతో అతడు తనకు కుమారుడు కావాలని భార్యను తరచూ హింసించేవాడు. తనకు కుమారుడిని ఇవ్వకపోతే విడాకులు ఇచ్చి మరొకరిని వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. మరోసారి గర్భిణి అయిన తన భార్య అనిత మగబిడ్డకు జన్మనిస్తుందో, లేదోననే ఆలోచనతో ఆమెతో రోజూ గొడవకు దిగేవాడు.
ఈ క్రమంలో పుట్టబోయే బిడ్డ విషయంలో ఓరోజు భార్యతో గొడవ పడ్డాడు. అంతటితో ఆగక.. పుట్టేది మగబిడ్డేనా.. కాదా అనేది తెలుసుకోవడానికి కొడవలితో భార్య కడుపును చీల్చాడు. దీంతో అప్పటికే 8 నెలల గర్భిణిగా ఉన్న ఆమె నొప్పి తట్టుకోలేక కేకలు వేస్తూ బయటికి పరుగులు పెట్టింది. సమీపంలో ఉన్న బాధితురాలి సోదరుడు ఆమె అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అనితను ఆసుపత్రికి తరలించాడు. ఆమెకు వెంటనే చికిత్స చేసిన వైద్యులు.. దాడి జరిగిన సమయంలో ఆమె కడుపులో ఉన్న మగబిడ్డ చనిపోయాడని ధ్రువీకరించారు. ఈ ఘటన అనంతరం పరారైన నిందితుడు పన్నాలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటన 2020లో జరగగా, తాజాగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.